హాట్ టాపిక్.. పాక్ పై పీవోకే ప్రజల ఆగ్రహం!
1948లో ఇండియా - పాకిస్థాన్ యుద్ధం ముందు పాకిస్థాన్.. జమ్ముకాశ్మీర్ లోని కొంత భాగాన్ని ఆక్రమించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 Sep 2023 7:45 AM GMT1948లో ఇండియా –పాకిస్థాన్ యుద్ధం ముందు పాకిస్థాన్.. జమ్ముకాశ్మీర్ లోని కొంత భాగాన్ని ఆక్రమించిన సంగతి తెలిసిందే. దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)గా భారత్ పిలుస్తోంది. పీవోకేపై ఎన్నోసార్లు భారత ప్రభుత్వాలు ఘాటైన ప్రకటనలు చేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తామని.. ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ నేతలు తరచూ ఈ అంశంపై ప్రకటనలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు పీవోకేలోని ప్రజలు పాక్ ప్రభుత్వంపై ఏ మాత్రం సంతృప్తిగా లేరు. గతంలోనే తమను భారత్ లో కలపాలని అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎలాంటి హక్కులు లేకపోవడం, తమ ప్రాంతం అభివృద్ధికి పాకిస్థాన్ ఏం చేయకపోవడం, విద్యా, వైద్య వసతుల లేమి తదితర కారణాలతో పీవోకే ప్రజలు భారత్ లో విలీనాన్ని కోరుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా కుంగిపోయింది. అత్యంత పతనావస్థకు జారిపోయింది. తాజాగా లీటర్ పెట్రోలు రేటు రూ.333 కు పెరిగింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.319కు పెరిగింది. ఇప్పటికే ఎలాంటి అభివృద్ధి లేక, ఉద్యోగాలు లేక సతమతమవుతున్న ప్రజలు నిత్యావసరాల ధరల పెంపు, పెట్రో రేట్ల పెంపుతో నరకం చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) వాసులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా పాక్ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోందని.. దాన్ని పాక్ ప్రభుత్వం తరలించుకుపోయి దేశమంతా వాడుకుంటోందని మండిపడుతున్నారు. తమకు మాత్రం అన్ని విషయాల్లో రిక్తహస్తం చూపుతున్నారని వాపోతున్నారు.
తమ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న కరెంటును తీసుకుపోయి వాడుకుంటున్న పాక్ ప్రభుత్వం బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, తమకు ఎక్కువ బిల్లులు వేస్తున్నారని పీవోకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పట్ల సహించరాని అన్యాయం అంటూ దుయ్యబడుతున్నారు.
కరెంటు బిల్లుల అంశంపై కొద్ది రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనలకు దిగుతున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలోనే రూ.139 కోట్ల మేర బిల్లులు వేశారు. ఈ విషయాన్ని పీవోకేలో ప్రముఖ స్థానిక నేత తౌకీర్ వెల్లడించారు. అయితే ఈ రూ.139 కోట్ల బిల్లులో కేవలం రూ.19 కోట్ల బిల్లులనే ప్రజలు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదని హెచ్చరించారు. పీవోకే ప్రజలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని తౌకీర్ విమర్శించారు.