వైరల్ వీడియో... స్పేస్ నుంచి బీచ్ లోకి పోలారిస్ డాన్ వ్యోమగాములు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని "స్పేస్ ఎక్స్" అంతరిక్ష సంస్థ తాజాగా సంచలనం సృష్టించింది.
By: Tupaki Desk | 15 Sep 2024 3:33 PM GMTప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని "స్పేస్ ఎక్స్" అంతరిక్ష సంస్థ తాజాగా సంచలనం సృష్టించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ వాక్ ప్రాజెక్ట్ పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ ఆదివారం సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఇందులో భాగంగా... అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో డ్రైటార్ట్ గస్ బీచ్ లో దీనికి సంబంధించిన స్పేస్ క్యాప్సుల్ విజయవంతంగా సముద్రంలోకి దిగింది.
అవును... ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ తాజాగా చరిత్ర సృష్టించింది. ఇందులో భాగంగా... తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ ను నిర్వహించిన సంస్థగా నిలిచింది. ఈ క్రమంలో స్పేస్ వాక్ పూర్తి చేసుకుని బిలియనీర్ జేర్డ్ ఇస్సాక్ మన్, పైలట్ స్కాట్ కిడ్ పోటీట్, మిషన్ స్పెషలిస్ట్ అన్నా మొనోన్, సారా గిల్లీస్స్ లు సురక్షితంగా సముద్ర తీరానికి చేరుకొన్నారు.
పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ కింద ఫాల్కన్ - 9 రాకెట్ ద్వారా గత మంగళవారం నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతరిక్షంలో ఐదు రోజుల పాటు గడిపిన ఈ బృందం సుమారు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. ఇందులో భాగంగా మైక్రోగ్రావిటీ లో మనిషి శరీరం ఎలా స్పందిస్తుంది.. కిడ్నీల పనితీరు మొదలైన అంశాలను పరిశీలించారు.
ఈ క్రమంలో జేర్డ్ ఇస్సాక్ మన్, సారా గిల్లీలు ఒకరితర్వాత ఒకరు క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ నిర్వహించారు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ ను పరీక్షించారు. ఈ క్రమంలో... వ్యోమగాములు స్పేస్ వాక్ చేసిన మొట్టమొదటి ప్రైవేట్ మిషన్ గా ఇది చరిత్ర సృష్టించింది. వీరి అంతరిక్ష నౌక అత్యధికంగా 875 మైళ్ల ఎత్తుకు చేరుకుంది. చంద్రుడిపైకి అపోలో మిషన్ల తర్వాత మనిషి ఈ స్థాయి ఎత్తుకు చేరడం కూడా ఇదే తొలిసారి!