Begin typing your search above and press return to search.

పోలవరానికి మోడీ వరం

పోలవరం విషయంలో గత పదేళ్ళుగా ఏపీ ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 6:37 PM GMT
పోలవరానికి మోడీ వరం
X

ఎట్టకేలకు పోలవరానికి భారీ వరం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 12 వేల 500 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుని ఆమోదముద్ర వేసింది. దాంతో మొత్తం పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ అల్లుకున్నా ఆటంకాల మేఘాలు తొలగిపోయాయని అంటున్నారు

పోలవరం విషయంలో గత పదేళ్ళుగా ఏపీ ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు కొంతవరకూ సాగాయి. అయితే కేంద్ర సాయం మాత్రం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కి ఆశించిన స్థాయిలో లేదు అన్న మాట ఉంది. పోలవరం విషయంలో ఆనాడు చంద్రబాబు తరువాత జగన్ కూడా కేంద్రానికి విన్నపాలు చేస్తూనే ఉన్నాయి. కానీ నాడు ఫలించలేదు. కానీ ఇపుడు పోలవరం కల సాకారం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.

దానికి కారణం కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. ఏపీలోని టీడీపీ ఎంపీల మద్దతు అవసరం పడుతోంది. దాంతోనే మోడీని చంద్రబాబు ఒప్పిస్తున్నారు మోడీ కూడా ఏపీ పట్ల గతానికి భిన్నంగా స్పందిస్తున్నారు అన్న భావన వ్యక్తం అవుతోంది.

నిజానికి పోలవరం ఎపుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఆ జాతీయ ప్రాజెక్ట్ ని ఏపీ చేతుల్లోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే దానికి రీఇంబర్స్మెంట్ ఇవ్వడానికే కేంద్రం మొగ్గు చూపిస్తోంది. అది కూడా కేంద్రానికి వీలు అయినపుడు.

దాంతో రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్ధిక ఇబ్బందులను చూసుకుంటూ పెట్టాల్సిన ఖర్చు పెడుతోంది. మరో వైపు పెట్టిన ఖర్చు కూడా వెనక్కి రాకుండా పెండింగులో పడిపోతోంది. దాని మీద ఇపుడు కదలిక బాగానే వచ్చింది. మరో వైపు చూస్తే పోలవరం విషయంలో 2014 -19 మధ్య బాగానే పనులు జరిగాయి.

ఆ సమయంలో కేంద్రంలో బీజేపీకి టీడీపీ మిత్రుడిగా ఉంటూ ప్రభుత్వంలో ఉంది. అలాగే ఏపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. కానీ ఆ తరువాత ఎన్డీయేతో టీడీపీకి కటీఫ్ అయిపోవడంతో పోలవరం కూడా ఆగిపోయింది.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం మీద పెద్దగా ఖర్చు చేయలేదు అన్న విమర్శలు ఉన్నయి. దానికి తోడు రివర్స్ టెండర్లకు వెళ్లి కాంట్రాక్టర్లను మార్చడంతో పనులు ఆగిపోయాయి. గైడ్ బండ్ కుంగిపోయింది. డయా ఫ్రం వాల్ కూడా దెబ్బతింది. దాంతో పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తరువాత పోలవరాన్ని ఎలా నిర్మించాలి అన్న దాని మీదనే చంద్రబాబు అలోచన చేశారు. పోలవరం సందర్శన తరువాత ఉన్నతాధికారులతో అంచనాలు వేశారు. తర్వాత పలుమార్లు కేంద్రాన్ని కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై వివరించారు. డీపీఆర్‌ను ఆమోదించాలని తక్షణం పనుల కొనసాగింపులకు రూ. 12500 కోట్లను విడుదల చేయడంతో పాటు పాత బిల్లులు రీఎంబర్స్ చేయాలని కోరారు. దీంతో కేంద్రం కూడా అన్నీ ఆలోచించే పోలవరానికి వరమిచ్చింది అని అంటున్నారు.

ఇక పోలవరం చూస్తే అది నూరు శాతం జాతీయ ప్రాజెక్ట్. మామూలుగా అయితే జాతీయ హోదా ప్రాజెక్టుల్లో 90 శాతం కేంద్రంపది శాతం రాష్ట్రం పెట్టుకుంటాయి. అయితే తర్వాత ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఆ పది శాతం కూడా తామే పెట్టుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు ముందుగా ప్రభుత్వం పనులు చేయించి బిల్లులు పెడితే కేంద్రం మంజూరు చేస్తూ వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం పోలవరం నత్తనడకేసింది. దీంతో ఇబ్బందులు వచ్చాయని అంటున్నారు.

మొత్తం మీద ప్రధనితో చంద్రబాబు పదే పదే కలసి చర్చించడం వల్ల నైతేనేమి కేంద్రం వద్ద తన పలుకుబడిని ఉపయోగించడం వల్ల అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితే ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఇదే తీరున కేంద్రం సాయం చేస్తే మరో మూడేళ్ళకు అయినా ఈ జీవనాడి లాంటి ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.