Begin typing your search above and press return to search.

పోల‌వరానికి సొమ్ములు.. ఎంతిచ్చారు? ఏంటి క‌థ‌!

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 6:47 AM GMT
పోల‌వరానికి సొమ్ములు.. ఎంతిచ్చారు?  ఏంటి క‌థ‌!
X

పోల‌వ‌రం.. ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి. సాగు-తాగు నీటి రంగాల‌కు వెన్నెముక‌గా మార‌నున్న ప్రాజెక్టు. ఈ విష‌యాన్ని కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖే అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చింది. మ‌రి చెప్పిన మేర‌కు సాయం చేస్తోందా? అంటే.. ప్ర‌శ్న‌గానే మారింది. జ‌గ‌న్ హ‌యాంలో త‌ప్పులు చేశార‌ని.. కాంట్రాక్టును మార్చొద్ద‌ని చెప్పినా వినిపించుకోలేద‌ని.. పెద్ద ఎత్తున కేంద్రం యాగీచేసింది. అందుకే పోల‌వ‌రం ఆల‌స్య‌మైంద‌ని పేర్కొంది.

స‌రే.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న‌ది బీజేపీ భాగ‌స్వామ్య కూటమి స‌ర్కారే క‌దా! మ‌రి ఇప్పుడు పోల‌వ‌రం పూర్తికి జోరుగా నిధులు ఇచ్చి ఆదుకోవ‌చ్చుక‌దా? అనేది ప్ర‌శ్న‌. కానీ, ఇప్పుడు కూడా అదే పంథా. ఎక్క‌డా బీజేపీ మార‌లేదు. మోడీ అస్స‌లే మార‌లేదు. ఈ ఏడాది బ‌డ్జెట్‌లో ఏకంగా 12 వేల కోట్లు ఇస్తామ‌ని మాట ఇచ్చారు. దీంతో చంద్ర‌బాబు కూట‌మి సంబ‌రాలు చేసుకుంది. గ‌డువులు పెట్టుకుంది. పోల‌వ‌రం పూర్తి చేయ‌డం బాధ్య‌త త‌మ‌దేన‌ని పేర్కొంది.

రోజులు కాదు.. నెల‌లు గ‌డిచాయి. రూపాయి రాలేదు. తాజాగా చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఈ విష‌యా న్నే హైలెట్ చేసిన‌ట్టు తెలిసిందే. దీంతో 'నిధులు ఇస్తున్నాం' అని మోడీ స‌ర్ చెప్పుకొచ్చి.. చంద్ర‌బాబు ను ఉత్సాహ‌ప‌రిచారు. ఇంకేముంది.. 12 వేల కోట్ల‌లో క‌నీసం 6 వేల కోట్ట‌యినా.. హీన‌ప‌క్షం 5 వేల కోట్ల‌యినా ఇవ్వ‌క‌పోతారా? అని చంద్ర‌బాబు అంచ‌నాలు వేసుకున్నారు. ఇదిలావుంటే.. మోడీ చెప్పిన త‌ర్వాత‌.. కేంద్ర ఆర్థిక శాఖ మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామునే ఏపీ ఖాతాలో నిధులు వేసింది.

అయితే.. ఇవి చంద్ర‌బాబు ఆశించిన మేర‌కు కాదు.. మోడీ చెప్పిన మేర‌కే! పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏ పద్దు కింద ఈ నగదు మొత్తాన్ని విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం లేదు. పాత బిల్లుల రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా పనులు చేపట్టేందుకు రూ.2000 కోట్లు ఇచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. కానీ, అడ్వాన్సులు ఇవ్వాలంటేనే 3,450 కోట్లు కావాల‌ని ప్ర‌భుత్వం లెక్క‌లు వేసింది. సో.. ఎలా చూసుకున్నా.. పోల‌వ‌రంలో ఆర్థిక స‌మ‌స్య అలానే ఉంది.