జనసేన ఎమ్మెల్యే కారుపై రాళ్లదాడి ఘటనలో బిగ్ ట్విస్ట్!
అవును.. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది దాడికి పాల్పడినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 July 2024 12:22 PM GMTఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించి.. ఆ దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలన్నట్లుగా ఆయన రియాక్ట్ అయిన పరిస్థితి! ఈ నేపథ్యంలో... ఈ ఘటనను సింపుల్ గా తేల్చేశారు ఎమ్మెల్యే బాలరాజు.
అవును.. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది దాడికి పాల్పడినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో... కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. అయితే... ఈ దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేరని వార్తలొచ్చాయి.
ఇలా ఎమ్మెల్యే కారుపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న జన సైనికులు ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో స్పందించిన బాలరాజు... తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల్లు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. అనంతరం... తనకు నియోజకవర్గంలో శత్రువులు ఎవరూ లేరని చెబుతూ.. ఈ ఘటన పూర్తిగా ఆకతాయిల పనే అని బాలరాజు తేల్చి చెప్పారు!
గత పదేళ్లుగా తాను జనంతో మమేకమై సేవచేస్తున్నానని చెప్పిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు... తనకు నియోజకవర్గంలో ప్రత్యేకంగా శత్రువులంటూ ఎవరూ లేరని అన్నారు! ప్రస్తుతానికి ఘటనపై విచారణ జరుగుతుందని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఇక తానెప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నట్లు తెలిపారు!
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క ఈ ఘటనపై స్పందించిన పోలీసుల వెర్షన్ మరో విధంగా ఉంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలపై పోలవరం డీఎస్పీ స్పందించారు. ఇందులో భాగంగా... ఎమ్మెల్యే నివాసంలో కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్న సందర్భంలో పోల్ పడి కారు అద్దం పగిలిందని.. కారుపై రాళ్లదాడి జరగలేదని స్పష్టం చేశారు.
రాత్రి వేరే కారులో ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన అనంతరం పీఏ, ఎమ్మెల్యే డ్రైవర్ ఇలా పోల్ పడి అద్దం పగిలిన విషయాన్ని గ్రహించకుండా కారులో బయటకు వచ్చారని.. అప్పుడు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఉన్న చోట కారు కుదుపులకు లోనవ్వడంతో పగిలిన అద్దం మొత్తం ఒకేసారి పడిపోయిందని అన్నారు. దీంతో... తమపై రాళ్లదాడి జరిగినట్లుగా చెప్పారని తెలిపారు. ఆ కారు అద్దం ఎలా పగిలిందో అప్పటికి వారికి తెలియదని స్పష్టం చేశారు!