పోలవరంలో కీలక నిర్మాణం.. మళ్లీ ఆ సంస్థకే!
పోలవరం ప్రాజెక్టులో కీలకంగా మారిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను మేఘా ఇనఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్)కే అప్పగించాలని నిర్ణయించింది.
By: Tupaki Desk | 17 Aug 2024 10:00 AM GMTపోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టులో కీలకంగా మారిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను మేఘా ఇనఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్)కే అప్పగించాలని నిర్ణయించింది.
2014–2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం నిర్మాణ పనులను నవయుగ, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలు చేశాయి. అయితే 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్లీ టెండర్లు నిర్వహించారు. మేఘా సంస్థ తక్కువ మొత్తానికి కోట్ చేసిందని చెబుతూ ఆ సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను జగన్ ప్రభుత్వం అప్పగించింది.
ఈ క్రమంలో పలుమార్లు ఫలానా నిర్దేశిత తేదీలనాటికల్లా పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం చివరకు విఫలమైంది. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం అస్తవ్యస్తంగా మారిందని చివరకు చేతులెత్తేసింది. కాఫర్ డ్యామ్ లు ముందు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ ముందు నిర్మించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని జగన్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన అంబటి రాంబాబు విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తన తొలి పర్యటనకు పోలవరంను ఎంపిక చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన అన్ని నిర్మాణాలను పరిశీలించారు. జగన్ అసమర్థ నిర్వాహకాలతో రెండు సీజన్లు వృథా అయ్యాయని.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఐదారేళ్లు సమయం పడుతుందని చెప్పారు.
రివర్స్ టెండరింగ్ కు వెళ్లి నిర్మాణ పనులను ఆలస్యం చేశారని.. దీంతో వరద నీరు ముంచెత్తి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చంద్రబాబు తెలిపారు. జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించకుండా వెంటనే పనులు మొదలుపెట్టినట్టయితే పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేదన్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను మళ్లీ నిర్మించడానికి నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. మేఘా సంస్థ మళ్లీ డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో దానికే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయి.
మేఘా సంస్థ 2022 నాటి ధరల ప్రకారమే 73 వేల క్యూబిక్ మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణానికి సిద్ధంగా ఉండడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతోపాటు కొత్తగా టెండర్లు పిలిచి కొత్తవారిని ఎంపిక చేసేందుకు మళ్లీ సమయం పడుతుందనే ఉద్దేశంతోనే మేఘాకే నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టినట్టు సమాచారం. త్వరలోనే తుది నిర్ణయం తీసుకొని మేఘాకే పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.