Begin typing your search above and press return to search.

ఆ స్వామీజీ గుట్టురట్టు అయ్యిందిలా!

దేవుడి పేరుతో దొంగ బాబాలు, స్వామీజీలు చేస్తున్న మోసాలు అన్నీఇన్నీ కావు.

By:  Tupaki Desk   |   28 Sep 2024 3:30 PM GMT
ఆ స్వామీజీ గుట్టురట్టు అయ్యిందిలా!
X

దేవుడి పేరుతో దొంగ బాబాలు, స్వామీజీలు చేస్తున్న మోసాలు అన్నీఇన్నీ కావు. ఇలాగే మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి జనాలకు రూ.300 కోట్ల మేర శఠగోపం పెట్టాడు. మహారాష్ట్ర నుంచి బిచాణా ఎత్తేసి ఉత్తరప్రదేశ్‌ కు తన మకాం మార్చాడు. అక్కడ తనను ఎవరు గుర్తుపట్టకుండా స్వామీజీ అవతారం ఎత్తాడు. అయితే ఎంత తెలివిగల వ్యక్తి అయినా ఎక్కడో చోట చిన్న తప్పు చేసి దొరికిపోయినట్టు పోలీసులకు దొరికిపోయాడు.

మహారాష్ట్రకు చెందిన బబ్బన్‌ విశ్వనాథన్‌ షిండే అధిక వడ్డీల ఆశ చూపి ప్రజల నుంచి రూ..300 కోట్లు వసూలు చేశాడు. జిజావు మాసాహెబ్‌ మల్టీ స్టేట్‌ బ్యాంక్‌ పేరుతో కుంభకోణానికి పాల్పడ్డాడు.

తమ డబ్బును సహకార బ్యాంకులోని నాలుగు శాఖల్లో పెట్టుబడి పెట్టేలా వారిని షిండే ఒప్పించాడు. ఆ తర్వాత ప్రజల డిపాజిట్లను తిరిగి చెల్లించకపోవడంతో అతడిపై కేసు నమోదైంది. నిందితుడిపై బీడ్, ధారశివ్‌ జిల్లాల నుంచి మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

దీంతో అతడు పోలీసులకు చిక్కకుండా ఉత్తరప్రదేశ్‌ లోని మథురకు మకాం మార్చాడు. అక్కడ స్వామీజీ అవతారం ఎత్తాడు. ప్రజల నుంచి తాను దోచేసిన డబ్బుతో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశాడు.

బబ్బన్‌ విశ్వనాథన్‌ షిండే కోసం వెతుకులాట సాగించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని మథురలోని బృందావన్‌ లో పట్టుకున్నారు. సెప్టెంబర్‌ 25న అతడిని మహారాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడు విశ్వనాథన్‌ షిండే పోలీసులకు చిక్కకుండా సాధువు వేషంలో ఢిల్లీ, అసోం, నేపాల్, యూపీలోని పలు జిల్లాలు తిరిగినట్లు డీఎస్పీ సందీప్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.

బబ్బన్‌ విశ్వనాథన్‌ షిండేను అరెస్టు చేసిన పోలీసులు అతడిని మహారాష్ట్రకు తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రిమాండు విధించింది.