Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ మెడకు మరో కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశం

మార్చి 18 నాటికి ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యేలా పోలీసులపై కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో, ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా మారతాయో వేచిచూడాల్సిందే.

By:  Tupaki Desk   |   12 March 2025 7:00 AM IST
కేజ్రీవాల్ మెడకు మరో కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశం
X

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయిన కేజ్రీవాల్‌కు, తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు మరో షాకిచ్చింది. 2019లో దాఖలైన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, ప్రజా ధనం దుర్వినియోగం ఆరోపణలపై కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మార్చి 18లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

-ప్రజాధనం దుర్వినియోగంపై కేసు

ఈ కేసులో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, ద్వారక మాజీ కౌన్సిలర్ నితికా శర్మల పేర్లు ఉన్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, హోర్డింగ్‌ల ద్వారా అవినీతి పాల్పడ్డారని పిటిషనర్ ఆరోపించాడు. వివిధ ప్రదేశాల్లో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ప్రభుత్వ నిధులను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

-కోర్టు నిర్ణయం.. పోలీసులకు ఆదేశాలు

రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని, కేజ్రీవాల్, గులాబ్ సింగ్, నితికా శర్మలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ జైలు జీవితం గడుపుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఆయన రాజకీయ భవిష్యత్తుపై మరిన్ని ప్రభావాలను చూపే అవకాశం ఉంది.

-ముందు ఏమి జరుగనుంది?

కేజ్రీవాల్‌పై నమోదయ్యే ఈ కేసు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పటికే పలు ఒత్తిడులు ఎదుర్కొంటున్న ఆప్ పార్టీకి ఇది మరొక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మార్చి 18 నాటికి ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యేలా పోలీసులపై కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో, ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా మారతాయో వేచిచూడాల్సిందే.