పవన్ పై పోలీసుకు ఫిర్యాదు.. లీగల్ ఒపీనియన్ కు సీపీ!
ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
By: Tupaki Desk | 19 Nov 2024 4:01 AM GMTఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఎన్డీయే తరుపున మహారాష్ట్రలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... నాందేడ్ జిల్లా దెగ్లూరు లో మాట్లాడూతు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
అవును... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఎంఐఎం నేత ముబాషీర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీపీ సీవీ ఆనంద్ కు ఎక్స్ లో ఫిర్యాదు చేశారు! హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ వ్యాఖ్యానించారని తెలిపారు!
అయితే... పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎంఐఎం నేత ముబాషీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వాసులను.. ప్రత్యేకించి అన్ని రకాల మతాల ప్రజలు కలిసి ఉంటున్న పాతబస్తీవాసులను అవమానపరుస్తూ... నగరంలో శాంతిభద్రతలను ఎంతో జాగ్రత్తగా మెయిటైన్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులను పవన్ కల్యాణ్ అవమానపరిచినట్టేనని అన్నారు.
గత 20 ఏళ్లుగా గణేష్ ఉత్సవాల్లాంటి పండగలను ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేకుండా జరుపుకుంటున్నామని.. ఇందులో పోలీసుల కృషి ఎంతో ఉందని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు అవమానకరమని అన్నారు.
ఇలా ఎంఐఎం నేత ముబాషీర్ పోలీసులకు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. ఇందులో భాగంగా... ఈ వ్యవహారంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని వెల్లడిస్తూ.. సదరు ఎంఐఎం నేతకు సమాధానం ఇచ్చారు. దీంతో... హైదరాబాద్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
కాగా.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. నాందేడ్ జిల్లా దెగ్లూరులో ప్రసంగించారు. ఈ సందర్భంగా... హైదరబాద్ లో ఉండే కొతమంది నేతలు పోలీసులు 15 నిమిషాలపాటు కళ్లు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామని అంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు ఇలాంటి ప్రభుత్వాలు వద్దని అన్నారు.
ఇదే సమయంలో... ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా? లేక, కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి హిందువుల అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేక, కలిసి బంగారు భవిష్యత్తును నిర్మించుకుందామా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు! ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి!