ఎవరీ రణవీర్ అల్లాబాడియా? సీఎంలే కేసులు పెట్టిస్తున్నారెందుకు?
రణవీర్ అల్లాబాడియా.. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రముఖ యూట్యూబర్ మీద కేసులు పెట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
By: Tupaki Desk | 12 Feb 2025 4:56 AM GMTరణవీర్ అల్లాబాడియా.. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రముఖ యూట్యూబర్ మీద కేసులు పెట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అతడి తీరుపై మండిపడుతున్నారు. చిన్న వయసులోనే బోలెడంత పేరు ప్రఖ్యాతులు.. సెలబ్రిటీ స్టేటస్ మాత్రమే కాదు.. భారీ సంపాదన సొంతం చేసుకున్న అతగాడికి నోటికి వచ్చినట్లుగా వాగే రోగం ఉంది. తాజాగా చేసిన ఒక పాడ్ కాస్ట్ అతడి కొంప మునిగేలా చేయటమే కాదు.. ఇతగాడి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తోంది. ఇంతకూ ఇతగాడెవరు? అతడికున్న ఇమేజ్ ఏంటి. తాజాగా అతను చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటి? దాని ఎఫెక్టు ఎంత? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ప్రముఖుడిగా మారాక బాధ్యతగా వ్యవహరించకపోతే ఎన్ని తిప్పలన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
దారిన పోయే దానయ్య నోటికి వచ్చినట్లుగా మాట్లడితే దానికి ఎలాంటి విలువ ఉండదు. అందుకు భిన్నంగా రంగం ఏదైనా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకొని.. చుట్టుపక్కల ఉన్న వారిని ప్రభావితం చేసే సత్తా ఉన్నోళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తమకు తాము హద్దుల గీతల్ని జాగ్రత్తగా గీసుకోవాలి. ఈ విషయంలో ఏ మాత్రం కట్టు తప్పినా తిప్పలే. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా చేయకూడని తప్పు చేశారు. అతడుచేసిన తప్పు గురించి మాట్లాడుకోవటానికి ముందు.. అతడి రేంజ్ ఎంతన్న విషయాన్ని తెలుసుకుంటే ఔరా అనుకుండా ఉండలేరు.
చూసినంతనే బాలీవుడ్ హీరోగా స్టైలిష్ లుక్ లో కనిపించే రణవీర్ (పూర్తి పేరు ప్రతిసారి చదవటం కష్టంగా ఉంటుంది) వయసు 32 ఏళ్లు. ముంబయి నివాసి అయిన ఇతడు తన 22 ఏళ్ల వయసు నుంచే యూట్యూబర్ గా అవతారం ఎత్తాడు. ట్రెండీగా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఇట్టే ఆకట్టుకునే అతగాడికి ఏడు యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. దగ్గర దగ్గర 40 లక్షల సబ్ స్క్రైబర్లు.. కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉండే అతడు.. పలువురు ప్రముఖులతో పాడ్ కాస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉంటూ.. 70 కేజీల బరువు మాత్రమే ఉంటే ఇతగాడు ఫిట్ నెట్ విషయంలో పక్కాగా ఫాలో అవుతుంటారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.60 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లుగా చెబుతారు. వార్షిక ఆదాయం కూడా భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇతడి వైవాహిక జీవితానికి వస్తే.. వైష్ణవి ఠక్కర్ అంటూ ప్రచారం జరిగింది. కొన్ని వర్గాల నుంచి అందే సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమెతో కలిసి లేరని చెబుతారు. యూట్యూబ్ నుంచే నెలకు రూ.35 లక్షల వరకు ఆదాయంతో పాటు.. వాణిజ్య ప్రకటనలు.. ఎండార్స్ మెంట్ల ద్వారా అతని సంపాదన చాలా ఎక్కువగా చెబుతారు. దేశంలో యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించే వారిలో అతడు ఒకరిగా చెబుతుంటారు. రణవీర్ తండ్రి వైద్యుడిగా పని చేస్తుంటారు. తల్లి ఇంటి పట్టునే ఉంటారని చెబుతారు. ఇతడి చదువు సంధ్యల విషయానికి వస్తే.. ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ లో బీటెక్ పూర్తి చేసి యూట్యూబర్ గా అవతారం ఎత్తాడు.
ఇతగాడు ఇంటర్వ్యూ చేసినవారిలో రాజకీయ ప్రముఖులు.. నటులు.. వ్యాపారవేత్తలు.. జ్యోతిష్యులు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. హాలీవుడ్ నటులను సైతం ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఉంది. అలాంటి ఇతడు.. ఇటీవల చేసిన పాడ్ కాస్ట్ లో మితిమీరిన వ్యాఖ్యల్ని చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. బయటకు రాలేని వివాదంలో ఇరుక్కున్నాడు. అతడు నిర్వహించే ‘ఇండియాస్ గాట్ లాటెండ్’ కొత్త ఎపిసోడ్ లో నోటికి వచ్చినట్లు చేసిన వ్యాఖ్యలతో అతడు కేసుల్లో చిక్కుకున్నాడు. రోస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు పలువురు సీఎంలు అతడి తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. పరిమితులకు మించిన అమర్యాదగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్న వార్నింగ్ ను చేతలతో చూపిస్తున్నారు.
తాజా షోలో అతను చేసిన ఛండాలమైన వ్యాఖ్యల్ని వీలైనంత సరళంగా.. క్లుప్తంగా చెప్పాల్సి వస్తే.. ‘నీ తల్లిదండ్రులు జీవితాంతం ప్రతిరోజు సెక్స్ చేయటం.. చూడటం నీకు ఇష్టమా?లేదంటే.. ఒక్కసారి చూసి.. జీవితాంతం చూడకుండా ఉండటం నీకు ఇష్టమా?’’ అంటూ రాయటానికే చిరాకు పుట్టే మాటల్ని ప్రశ్న రూపంలో అడిగేశాడు. ఈ వ్యాఖ్యపై వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఏకిపారేస్తున్నారు.ఈ వీడియోను వెంటనే తొలగించాలని యూట్యూబ్ సంస్థకు నోటీసులు పంపటంతో దాన్ని తొలగించారు.
ఇతగాడి మాటల్నివిన్న తర్వాత.. అతడ్నికంట్రోల్ లో పెట్టాలని.. ఆయన్ను అన్ ఫాలో చేయాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు పలువురు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు.. అతడి వ్యాఖ్యలపై పలువురు ఎంపీలు ఫిర్యాదులు చేయటం.. విషయం పార్లమెంట్ వరకు వెళ్లింది. రణవీర్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర సమాచార.. సాంకేతిక శాఖ నోటీసులు జారీ చేయాలని.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు పట్టుబడుతున్నారు.
ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఇతడికి భారీ పాపులార్టీనే కాదు.. అతడ్ని పిచ్చిగా ప్రేమించేటోళ్లు ఎక్కువే. అలాంటివారిలో ఒక మహిళా వీరాభిమాని ఉంది.ఆమె పేరు రోహిణి అర్జు. ఆధ్యాత్మిక కంటెంట్ క్రియేటర్ గా ఉండే ఆమె వృత్తిరీత్యా పశువైద్యురాలు. రణవీర్ కు వీరాభిమాని. ఎంతంటే.. తన ఛాతీ పైభాగంలో అతడి పేరును టాటూగా వేసుకోవటమే కాదు.. స్వామీ.. నేను మీ కోసం వేచి ఉన్నాను’ అంటూ ఓపెన్ గా ప్రపోజ్ చేసింది. తన టాటూ ఫోటోను సైతం షేర్ చేసింది.
తనను ఎంతమంది వెక్కిరించినా.. ఎగతాళి చేసినా.. పిచ్చి అనుకున్నా.. ఎక్కడ ఎలా ఉన్నావనే దానితో సంబంధం లేకుండా అతడ్ని తాను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటానని పోస్టులు పెడుతుంటారు. తన సర్వస్వం రణవీర్ గా పేర్కొంటూ ఉంటారు. అతడి ఫోటోలను టిఫిన్ గా మార్చి తినటం..అతడి ఫోటోను పక్కన పెట్టుకొని నిద్రపోవటంతో పాటు.. అతడి మీద తనకున్న ప్రేమను చూపుతూ బోలెడన్ని రీల్స్ చేసింది. ఆమె అభిమానాన్ని.. పిచ్చి ప్రేమను కొందరు క్రేజ్ కోసం.. పేరు కోసం ఇలా చేస్తున్నదంటూ మండిపడగా.. మరికొందరు ఆమె ‘‘ఎరోటోమానియా’’ అనే మానసిక రుగ్మతతో బాధ పడుతుందని వ్యాఖ్యానిస్తుంటారు. గత సెప్టెంబరులో రణవీర్ ను తప్పించి తాను ఎవరిని పెళ్లి చేసుకోనన్న ప్రకటన చేసింది. అయితే.. ఆమె వీడియోలపై రణవీర్ ఎప్పుడూ రియాక్టు కాకపోవటం గమనార్హం.
ఈ వీరాభిమాని ఎపిసోడ్ ను ఇక్కడ ఆపేస్తే.. నోటి దూలతో మాట్లాడిన రణవీర్ మాటలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. కామెడీ కంటెంట్ పేరుతో భాష హద్దులు దాటుతోందని.. అశ్లీలతను ప్రోత్సహించటం.. లైంగికంగా అసభ్యకర చర్చలో పాల్గొనటం లాంటి ఆరోపణలతో రణవీర్ తో పాటు.. అతడితో పాటు పాల్గొన్న ఇతరులపైనా చర్యలకు డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు అసోం సీఎం రణవీర్.. అతడితో పాటు చర్చలో పాల్గొన్న ఇతరులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. దాదాపు 30 మంది మీద కేసు నమోదు చేసినట్లుగా ముంబయి పోలీసులు చెబుతున్నారు.
ఇతడి తప్పుడు వ్యాఖ్యలపై పలువురు ఎంపీల ఫిర్యాదు చేయటంతో పార్లమెంటరీ ప్యానెల్ లో రణవీర్ ను విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్యానల్ విచారణకు హాజరు కావాలని ఈ యూట్యూబర్ కు నోటీసులు అందే అవకాశం ఉంది. ఈ మొత్త వ్యవహారంపై స్పందిస్తూ చెంపలేసుకున్నాడు రణవీర్. తాను తప్పు చేశానని క్షమించాలని వేడుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశాడు. అయితే.. అతడి క్షమాపణల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవటం గమనార్హం.
మరోవైపు ఈ వ్యవహారాన్ని సుమోటాగా స్వీకరించింది ముంబయి సైబర్ డిపార్టుమెంట్. ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసింది. ఈ షోకు సంబంధించి మొత్తం 18 ఎపిసోడ్ లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి.. రణవీర్ తో పాటు మిగిలిన వారికి సమన్లు జారీ చేసింది. అందుకే అంటారు అద్భుతమైన విజయాన్ని సాధించటం తేలికే. కానీ..దాన్నినిలుపుకోవటం.. ఆ గౌరవ మర్యాదల్ని కొనసాగించటమే కష్టమని. ఈ మాటలకు రణవీర్ ఉదంతం చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని చెప్పాలి.