వైసీపీ నేత కాకాని పై మరో కేసు.. ఏం జరిగింది?
దీనిలో కాకాని పాత్ర ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోర్టుకు వెళ్లి.. కేసు పెట్టించారు. ఈ కేసు ఇంకా కొనసాగుతోంది.
By: Tupaki Desk | 22 Jan 2025 8:19 AM GMTవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి పై మరో కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా సర్వే పల్లి నియోజకవర్గానికి చెందిన కాకాని వైసీపీ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కోర్టు కస్టడీలో ఉన్న ఫైళ్లను దొంగతనం చేసిన కేసు ఒకటి తెరమీదికి వచ్చింది. దీనిలో కాకాని పాత్ర ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోర్టుకు వెళ్లి.. కేసు పెట్టించారు. ఈ కేసు ఇంకా కొనసాగుతోంది.
ఇక, ఇప్పుడు తాజాగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకానిపై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా కోళ్ల దిన్నె ప్రాంతానికి చెందిన కావలి ప్రసన్న అనే వ్యక్తి.. కాకానిపై నెల్లూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులను తూలనాడడంతో పాటు వారిని బెదిరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా పోలీసులపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడేలా చేశారని.. పోలీసు వ్యవస్థను కించపరిచారని కూడా ప్రసన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
మంగళవారం రాత్రి కావలి ప్రసన్న ఫిర్యాదు చేయగా.. బుధవారం ఉదయాన్నే పోలీసులు కాకానికి నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఇదిలా వుంటే.. ఈ నెల తొలి వారంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని బోగోలు ప్రాంతంలో కాకాని గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. వైసీపీ నాయకులపై పెట్టిన కేసుల విషయంపై ఆయన స్పందిస్తూ.. ఎల్లకాలం కూటమి అధికారంలో ఉండదని.. తాము అధికారంలోకి వచ్చాక.. తమపై కేసులు పెడుతున్న పోలీసులను శంకరగిరి మన్యాలు పట్టిస్తామని.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ పరిణామాలు అప్పట్లోనే చర్చకు వచ్చాయి. దీనిపై తాజాగా కావలి ప్రసన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.