విద్యార్థుల మిస్సింగ్.. 500 సీసీ ఫుటేజీలను తనిఖీ చేసిన పోలీసులు
ఏకంగా 500 కెమెరాల సీసీ ఫుటేజీలను తనిఖీ చేయాల్సి వచ్చిందంట.
By: Tupaki Desk | 8 Sep 2024 8:30 PM GMTదేశ రాజధాని ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని.. టీచర్లు పేరెంట్స్‌ని తీసుకురమ్మన్నందుకు ఇంటి నుంచి పారిపోయారు. దాంతో వారిని వెతికేందుకు పోలీసులు పడిన కుస్తీ అంతాఇంతా కాదు. వారికి ఈ ఘటన కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పాలి. ఏకంగా 500 కెమెరాల సీసీ ఫుటేజీలను తనిఖీ చేయాల్సి వచ్చిందంట. మరి ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.
అటు తల్లిదండ్రులు, పోలీసులు వారి కోసం వెతకని ప్రదేశం అంటూ లేదు. చివరకు సీసీ ఫుటేజీలతో విద్యార్థుల ఆచూకీని కనుగొన్నారు. దాంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
ఢిల్లీ నోయిడా సెక్టార్ 56లోని ఆర్యన్ చౌరాశ్యా, నితిన్ ధ్యాన్‌లు ఓ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు. గత వారం స్కూల్‌లో పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఆ ఇద్దరికి తక్కువ మార్కులు వచ్చాయి. దాంతో క్లాస్ టీచర్ వారి మీద సీరియస్ అయ్యారు.
తక్కువ మార్కులు వచ్చాయని, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద మీ పేరెంట్స్ సైన్ తీసుకురావాలని టీచర్ ఆదేశించారు. అలాగే.. తల్లిదండ్రులను స్కూల్‌కి తీసుకురావాలని అన్నారు. ఈ విషయం తెలిస్తే తమ తల్లిదండ్రులు తమను తిడుతారని భయపడ్డారు. దాంతో ఎటైనా పారిపోవాలని అనుకున్నారు. అదే రోజు సాయంత్రం స్కూల్ ముగిశాక పారిపోయారు. స్కూల్ నుంచి వచ్చే సమయం మించి పోయినా వారు ఇంటికి చేరుకోలేదు.
దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి పిల్లల కోసం తిరిగారు. ఏడు బృందాలుగా విడిపోయి వారి కోసం గాలించారు. ఒక్కొక్కటిగా 500 సీసీ కెమెరాల ఫుటేజీని తనిఖీ చేశారు. చివరకు ఆ విద్యార్థులు వారి ఇంటి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. చివకు వారిని అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.