Begin typing your search above and press return to search.

పవన్‌ కళ్యాణ్‌ పై పోలీసులకు ఫిర్యాదు!

ఈ నేపథ్యంలో తమిళనాడులోని అధికార డీఎంకే పవన్‌ కళ్యాణ్‌ పై కౌంటర్‌ ఎటాక్‌ కు దిగింది. ఆయనపై డీఎంకే సానుభూతిపరుడైన న్యాయవాది ఒకరు మదురైలో ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 7:21 AM GMT
పవన్‌ కళ్యాణ్‌ పై పోలీసులకు ఫిర్యాదు!
X

తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డ తయారీలో జంతువుల కొవ్వులు వాడారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.

మరోవైపు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి పాదయాత్రగా తిరుమల చేరుకున్న పవన్‌ తన 11 రోజుల ప్రాయశ్చిత దీక్షను అక్కడ విరమించారు. అంతేకాకుండా తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ పేరిట సభ నిర్వహించారు. సనాతన ధర్మంపై, హిందువుల దేవుళ్లపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నవారిపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ను, కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీని ఏకిపారేశారు.

ఈ నేపథ్యంలో తమిళనాడులోని అధికార డీఎంకే పవన్‌ కళ్యాణ్‌ పై కౌంటర్‌ ఎటాక్‌ కు దిగింది. ఆయనపై డీఎంకే సానుభూతిపరుడైన న్యాయవాది ఒకరు మదురైలో ఫిర్యాదు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఉదయనిధి స్టాలిన్‌ ను పరోక్షంగా బెదిరించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

ఈ మేరకు పవన్‌ పై న్యాయవాది వాంజినాధన్‌ ముదురై పోలీసు కమిషనర్‌ కు ఫిర్యాదు ఇచ్చారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్‌ తమిళ ప్రజలను, అంబేడ్కర్‌ ను కించపరుస్తూ మాట్లాడారని తన ఫిర్యాదులో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీ వర్గాలపై ద్వేషం వెళ్లగక్కేలా మాట్లాడిన పవన్‌ పై చర్య లు తీసుకోవాలని కోరారు.

అంతేకాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారని న్యాయవాది వాంజినాధన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసుక్రీస్తు, అల్లా గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తున్నారని పవన్‌ అన్నారని.. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగాయని వాంజినాధన్‌ నిలదీశారు.

తిరుపతి లడ్డూ వ్యవహారంలో ముస్లింలు, క్రైస్తవులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. అక్కడ నెయ్యి సరఫరా చేస్తుంది.. లడ్డూ తయారు చేస్తుంది హిందువులేనని తెలిపారు. వాంజినాథన్‌ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు చేపడతామని కమిషనర్‌ తెలిపారు. మరోవైపు పవన్‌ తన పైన చేసిన వ్యాఖ్యలపైన ఉదయనిధి స్టాలిన్‌ కూడా స్పందించారు. వేచి చూద్దామంటూ పేర్కొన్నారు.