శభాష్ పోలీస్ : డ్రోన్ టెక్నాలజీతో గంజాయి ధ్వంసం
ఏపీలో అధునాతన సాంకేతిక వ్యవస్థగా డ్రోన్ల వినియోగం ఉంది. దాని ఆసరాతో ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలలో సహాయం అందించారు.
By: Tupaki Desk | 12 Nov 2024 3:38 AM GMTఏపీలో అధునాతన సాంకేతిక వ్యవస్థగా డ్రోన్ల వినియోగం ఉంది. దాని ఆసరాతో ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలలో సహాయం అందించారు. ఇపుడు అవే డ్రోన్లతో మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీని ఒక్క లెక్కన కుదుపుతున్న గంజాయిని విద్వంసం చేయడానికి డ్రోన్ టెక్నాలజీని వాడడం ఇదే ఫస్ట్ టైం.
అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు జి మాడుగుల మండలం డేగలరాయి గ్రామంలో అయిదు ఎకరాల పోలంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్టుగా పోలీసులు గురించారు వెంటనే డ్రోన్ టెక్నాలజీని వినియోగించి ఆ అక్రమ గంజాయి సాగు మొత్తాన్ని ధ్వంసం చేశారు.
ఇక్కడ విశేషం ఏమిటి అంటే అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ టెక్నాలజీతో బయటకు తీయడం. అంతే దూకుడుతో అదే టెక్నాలజీతో నాశనం చేయడం. దీంతో పోలీసులు తీసుకున్న ఈ చర్యలకు ప్రశంసలు కురుస్తున్నాయి.
ఎక్కడో ఏజెన్సీలో మారు మూలలో ఈ విధంగా గంజాయి సాగు చేస్తూ ఎవరికీ పట్టుబడకుండా ఇంతకాలం జాగ్రత్త పడుతున్న వారి ఆటలు సాగేది లేదని డ్రోన్ టెక్నాలజీతో పోలీసులు రుజువు చేశారు. ఈ దెబ్బతో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లుగా అల్లూరి జిల్లా పోలీసులు తెలిపారు. ఇక ఈ విధంగా అల్లూరి జిల్లా పోలీసులు గంజాయి అక్రమ సాగుని గమనించి దానిని అక్కడ తుదముట్టించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
టీడీపీ కూటమి డ్రోన్ టెక్నాలజీకి ఇపుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అంతే కాదు రోజూ వారీ కార్యక్రమాలకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు మార్లు చెప్పారు.
దీంతో ప్రభుత్వం వైపు నుంచి అందుతున్న ప్రోత్సాహాన్ని వాడుకుంటూ అల్లూరి జిల్లా పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన అడవి మధ్య గంజాయి పండిస్తున్న భూమిని చాలా చాకచక్యంగా గుర్తించారు. అంతే గంజాయి మొత్తాన్ని లేకుండా చేశారు.
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అక్టోబర్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ పెరుతో 5,500 డ్రోన్‌లతో అతి పెద్ద కార్యక్రమం నిర్వహించింది. ఇది ఏకంగా అయిదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను నెలకొల్పి ఏపీకి పేరు తెచ్చింది. దాంతో చంద్రబాబు డ్రోన్ టెక్నాలజీ ఏపీకి కొత్త ఉదయాన్ని ఇస్తుందని నాడే చెప్పారు. ఇపుడు అది రుజువు అవుతోంది.
మరో వైపు చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని అన్నారు. అంతే కాదు గంజాయిని కూడా తుదముట్టించాలని పిలుపు ఇచ్చారు. దాంతో గంజాయి లేని రాష్ట్రం అన్న కూటమి నినాదాన్ని ఒక సవాల్ గా తీసుకున్న పోలీసులు ఇపుడు టెక్నాలజీ ఆసరాతో సక్సెస్ అవుతున్నారు. అల్లూరి జిల్లా సహా గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు అలాగే మాదక ద్రవ్యాల అక్రమా రవాణా మీద కూడా ఫోకస్ పెంచారు. ఇపుడు డ్రోన్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి తెచ్చారు కాబట్టి ఇక గంజాయి అక్రమార్కులకు చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు.