Begin typing your search above and press return to search.

పోలీస్ కస్టడీకి తిరుమల లడ్డూ కేసు నిందితులు

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు నలుగురిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 10:55 AM GMT
పోలీస్ కస్టడీకి తిరుమల లడ్డూ కేసు నిందితులు
X

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు నలుగురిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను కోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వీరిని ఐదు రోజులు పాటు విచారించనున్నారు.

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన సిట్ నలుగురిని అరెస్టు చేసిన విషయ తెలిసిందే. ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావ్డాలను విచారించాలని సిట్ అధికారులు తిరుపతి రెండో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, నిందితులను ఐదు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాలతో శుక్రవారం నిందితులను జైలు నుంచి తీసుకువచ్చిన పోలీసులు ముందుగా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

మరోవైపు సిట్ అధికారులు రెండు టమ్స్ ను ఏర్పాటు చేసి చెన్నై, ఉత్తరాఖండ్ లోని నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందన్న కోణంలో ఆరా తీస్తున్న సిట్ త్వరలో మరికొందరి అరెస్టు చూపే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినా, మరో 10 మంది సిట్ అదుపులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, నిందితులను విచారించేందుకు సీబీఐ డెరెక్టర్ కూడా తిరుపతి రానున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. దీంతో నిందితుల కస్టడీ సమయంలో విచారించేందుకు ఓ రోజు ఆయన వస్తారంటున్నారు. ఆ సమయంలోనే ఏ1 అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.