Begin typing your search above and press return to search.

తిరుపతి జిల్లా తాజా పరిస్థితి ఏంటి?

తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు వినియోగించారన్న ఆరోపణలు క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 4:36 AM GMT
తిరుపతి జిల్లా తాజా పరిస్థితి ఏంటి?
X

తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు వినియోగించారన్న ఆరోపణలు క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఎప్పటిలానే ఇదో రాజకీయ అంశంగా మారటమే కాదు.. అధికారప్రతిపక్ష నేతల మధ్య కొత్త తరహా మాటల యుద్ధం మొదలైంది. ఎవరు తగ్గరన్నట్లుగా వారి తీరు మారింది. దీంతో.. మాటల తూటాలతో రాజకీయ రంగం హాట్ హాట్ గా మారగా.. సెలబ్రిటీలు.. సోషల్ మీడియాలో సామాన్యులు సైతం తలోచేయి వేస్తున్నారు.

ఈ మొత్తానికి కేంద్రమైన తిరుమల తిరుపతితో పాటు.. తిరుపతి జిల్లాలో పరిస్థితి ఇప్పుడెలా ఉంది? శాంతిభద్రతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని చూస్తే.. తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నారు. అయితే.. ముందస్తుజాగ్రత్త చర్యల్లో భాగంగానే తప్పించి మరొకటి లేదంటున్నారు. అదే సమయంలో తిరుపతి లడ్డూ వ్యవహారంపై పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు.. సామాన్యులు.. ఆందోళనకారులు వస్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఇబ్బందిరకంగా మారకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్ని తీసుకుంటున్నారు.

తిరుపతి లడ్డూ ఎపిసోడ్ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం తిరుమలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేతగా.. విపక్ష ఎమ్మెల్యేగా ఆయన నుంచి డిక్లరేషన్ తీసుకుంటారన్న చర్చ.. అలా తీసుకునే వేళలో జగన్ అండ్ కో రియాక్షన్ ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే దీన్నో రాజకీయ అంశంగా మార్చాలన్న ఆలోచన పలువురి మాటల్ని చూస్తే అర్థమవుతుంది.

అందుకే.. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించకుండా ఉండేందుకు పోలీసులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 (పోలీస్ యాక్టు) అమల్లోఉండనుంది. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం అక్టోబరు 24 వరకు అంటే నెల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమతి లేకుండా సభలు.. సమావేశాలు.. భేటీలు.. ఊరేగింపులు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారకూటమికి చెందిన వారు నిర్వహించే ర్యాలీల విషయంలో ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.