మాచర్ల నియోజకవర్గం మిగిలింది ఆ ఒక్కడే
పల్నాడు జిల్లాలో హింసా రాజకీయాలకు మాచర్ల నియోజకవర్గం కేంద్రం. రాష్ట్రంలోనే సమస్మాత్మక నియోజకవర్గంగా చెప్పే ఈ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా తీవ్ర హింస చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 7 Jan 2025 5:30 PM GMTమాచర్ల నియోజకవర్గం ఈ పేరు చెబితేనే ఫ్యాక్షన్ గొడవలు గుర్తుకొస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై జరిగిన దాడి. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింస. అన్నీ మాచర్లలో పరిస్థితి కళ్లకు కడతాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ హింసాకాండపై వరుస కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డితోపాటు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి అనుచరుడైన మాజీ మున్సిపల్ చైర్మన్ తురాకా కిశోర్ ఇలా చాలా మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇలా కేసులు నమోదైన వారిలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, తురకా కిశోర్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. పిన్నెల్లి బెయిల్ పై బయటకు రాగా, తురకా కిశోర్ కు కోర్టు రిమాండ్ విధించింది. ఇక ఈ నియోజకవర్గంలో మిగిలిన ప్రధాన అరెస్టు మాజీ ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామిరెడ్డే. ఏడు నెలలుగా అండర్ గ్రౌండులో ఉన్న వెంకటరామిరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు.
పల్నాడు జిల్లాలో హింసా రాజకీయాలకు మాచర్ల నియోజకవర్గం కేంద్రం. రాష్ట్రంలోనే సమస్మాత్మక నియోజకవర్గంగా చెప్పే ఈ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా తీవ్ర హింస చోటు చేసుకుంది. ఏకంగా పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ పైనే అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇక అంతకు ముందు కూడా టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల లక్ష్యంగా ఎన్నో దాడులు జరిగాయి. వీటిపై అప్పట్లో కేసులు నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఏడు నెలల క్రితం ప్రభుత్వం మారడం, మాచర్లలో 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగిన పిన్నెల్లి అనూహ్యంగా ఓడిపోవడంతో పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పోలీసు కేసుల్లో నిందితుల అరెస్టులు మొదలయ్యాయి. తొలుత అంతా అండర్ గ్రౌండులోకి వెళ్లినా, పోలీసులు ముమ్మరంగా వేటాడి పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇలా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి నుంచి తురకా కిశోర్ వరకు ఒక్కొక్కరిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఇప్పటివరకు మాచర్ల నియోజకవర్గం వరకు ప్రధాన కేసుల్లో ప్రధాన నిందితుల్లో ఒక్కరు తప్ప అంతా అరెస్టు అయినట్లేనని చెబుతున్నారు. ఆ ఒక్కరు పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి. అధికారంలో ఉండగా, ఎమ్మెల్యే పిన్నెల్లికి వెన్నుదన్నుగా నిలిచిన వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల అనంతరం మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఇక మే 14న కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన కేసు కూడా ప్రధానమైనదే. జూన్ 4 వరకు మాచర్లలోనే ఉన్న వెంకటరామిరెడ్డి ఫలితాలు వెలువడిన గంటల్లోనే అండర్ గ్రౌండుకి వెళ్లారు.
మాజీ ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి అరెస్టు సమయంలోనే వెంకట్రామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని చెప్పినా, ఆయన త్రుటిలో తప్పించుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రామక్రిష్ణారెడ్డి కొన్నాళ్లు రిమాండులో ఉన్నా వెంకట్రామిరెడ్డి బయటకు రాలేదు. ఇప్పుడు ఆయన మాదిరిగానే అండర్ గ్రౌండులో ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్ ను పోలీసులు పట్టుకున్నారు. దీంతో బ్యాలెన్స్ వెంకట్రామిరెడ్డి అంటున్నారు. ఆయన కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జల్లెడపడుతున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీలకు ప్రత్యేక టీములు వెళ్లినా వెంకట్రామిరెడ్డి మాత్రం దొరకలేదు.