Begin typing your search above and press return to search.

వైసీపీ కీలక నేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 9:11 AM GMT
వైసీపీ కీలక నేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
X

వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్లిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నాడు పదుల సంఖ్యలో కార్ల కాన్వాయ్‌ తో జోగి రమేశ్‌ ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జోగి రమేశ్‌ పై పోలీసులు కేసు నమోదు చేయలేదు. టీడీపీ కార్యకర్తలు, నేతలపైనే కేసు పెట్టారు.

ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జోగి రమేశ్‌ పై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో ఆగస్టు 20 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని జోగి రమేశ్‌ కు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది.

ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా ఆయన తన పాస్‌ పోర్టును కూడా పోలీసులకు స్వాధీనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో ఇప్పటికే ఒకటి రెండుస్లారు పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేశ్‌ తాజాగా మరోసారి విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మంగళగిరి పోలీసులు ఇటీవల జోగి రమేశ్‌ కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన తాజాగా విచారణకు హాజరయ్యారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఆయనను విచారిస్తున్నారు.

కాగా తాను చంద్రబాబు ఇంటిపైకి దాడి చేయడానికి వెళ్లలేదని.. నిరసన తెలపడానికి మాత్రమే వెళ్లానంటూ జోగి రమేశ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తనపై చంద్రబాబు కక్ష సాధింపునకు దిగారని ఆరోపించారు. ఇప్పటికే తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని.. ప్రతి పశ్నకు సమాధానం చెబుతానని తెలిపారు.

కొద్ది రోజుల క్రితం తన కుమారుడు రాజీవ్‌ ను అరెస్టు చేసినప్పుడు కూడా జోగి రమేశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. తన కులం పేరును చెప్పుకున్న ఆయన బడుగు బలహీనవర్గాలు ఎదుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు.

ఆ రోజు చంద్రబాబు ఇంటిపైకి తాను దాడికి వెళ్లలేదని.. వైఎస్‌ జగన్‌ ను టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తిడితే తట్టుకోలేక చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పెద్ద మనిషిగా న్యాయం చేయాలని కోరేందుకు వెళ్లానని జోగి వివరణ ఇచ్చారు.

కాగా ఈ కేసులో జోగికి ముందస్తు బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 4వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు మరో నెల జోగి బెయిల్‌ పై ఉండనున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.