వివేకానందరెడ్డి పీఏను విచారించిన పోలీసులు.. విషయం ఏంటి?
ఏపీ మాజీ సీఎం జగన్ బాబాయి, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు విచారణ కొనసాగుతు న్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 18 Nov 2024 8:15 AM GMTఏపీ మాజీ సీఎం జగన్ బాబాయి, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు విచారణ కొనసాగుతు న్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో 2022లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డికి పర్సన్ అసిస్టెంట్‌గా వ్యవహరించిన కృష్ణారెడ్డి.. పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి సహా అప్పట్లో ఈ కేసును విచారించిన సీబీఐ ఎస్పీ రాం సింగ్‌లపై అనేక ఆరోపణలు చేశారు.
దీంతో పోలీసులు(వైసీపీ హయాంలో) హుటాహుటిన కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నారు. ఆ వెంటనే సునీత, రాజశేఖర్‌రెడ్డి, రాం సింగ్‌లపై 2022లోనే కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వారంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక, రాంసింగ్‌ను ఈ కేసు విచారణ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సునీత, రాజశేఖర్‌రెడ్డిలు.. అసలు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై పెట్టిన కేసులు కొట్టి వేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
గత రెండు నెలల కిందట జరిగిన ఈ కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు.. అసలు ఏం జరిగిందో విచారిం చాలంటూ.. పోలీసులను ఆదేశించింది. కృష్ణారెడ్డి వాంగ్మూలం నమోదుచేయాలని కూడా పేర్కొంది. దీంతో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తన సిబ్బందితో సోమవారం(ఈరోజు) ఉదయాన్నే కృష్ణారెడ్డి ఇంటికి చేరుకుని.. ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానం రాబట్టారు. దీనిని కోర్టుకు సమర్పించనున్నారు.
కృష్ణారెడ్డి ఫిర్యాదు ఏంటి?
వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పాలంటూ తనను అప్పటి సీబీఐ ఎస్పీ రాం సింగ్ బెదిరించారని.. కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను ఒత్తిడి చేశారని, మానసికంగా వేదనకు కూడా గురి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవాలు తనకు తెలియదని చెప్పినా.. తాము చెప్పినట్టుగా నడుచుకోవాలని సునీత, రాజశేఖర్‌లు ఒత్తిడి చేసినట్టు కృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయాలనే సునీత హైకోర్టును ఆశ్రయించగా.. కృష్ణారెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.