‘మంచు’ వివాదంలో పోలీసులు ఫెయిల్?
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు రోజుల నుంచి తెలుగు మీడియా.. సోషల్ మీడియా.. యూట్యూబ్.. వాట్సాప్ గ్రూపుల్లో మంచు కుటుంబంలో నెలకొన్న విభేదాలతో హోరెత్తిపోయింది.
By: Tupaki Desk | 11 Dec 2024 4:45 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు రోజుల నుంచి తెలుగు మీడియా.. సోషల్ మీడియా.. యూట్యూబ్.. వాట్సాప్ గ్రూపుల్లో మంచు కుటుంబంలో నెలకొన్న విభేదాలతో హోరెత్తిపోయింది. ఎంతలా అంటే.. వాళ్లింట్లో గొడవ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ మాట్లాడుకునేంతగా. దీనిపై కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తే.. మరికొందరు ఇంతకు మించి మరే విషయాలు లేవా మాట్లాడుకోవటానికి అంటూ వాపోయినోళ్లు ఉన్నారు.
ఇంటి పక్కనున్న ఫ్యామిలీ కొట్టుకుంటేనే.. వీధి మొత్తం కళ్లప్పగించి చూసే పరిస్థితుల్లో ఒక సినీ కుటుంబంలో నెలకొన్న విభేదాలు ఎందుకు ఆసక్తికరం కావు? అంటూ ప్రశ్నించేవాళ్లు ఉన్నారు. ఈ వాద ప్రతివాదాల్ని పక్కన పెట్టి.. మీడియా తప్పు చేసిందా? ఒప్పు చేసిందా? అన్న తూకం తూచే ముందు.. ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు వ్యవహరించిన తీరేంటి? గొడవ ఇంత పెద్దదై.. హద్దులు దాటే ఆవేశాల్ని ప్రదర్శించే వరకు ఎందుకు పోలిచ్చారు? కంట్రోల్ చేయాల్సిన ఖాకీలు మోహన్ బాబు టీవీ చానల్ గొట్టం పట్టుకొని మీడియా ప్రతినిధుల మీద దాడి చేయటం మొదలు.. ఇంట్లోని మోహన్ బాబు.. మంచు విష్ణు.. మంచు మనోజ్ లకు చెందిన వ్యక్తిగత సిబ్బంది కం బౌన్సర్లు కలబడే వరకు వెళ్లినా పోలీసులు కళ్లప్పగించి ఎందుకు చూశారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.
ప్రైవేటు బౌన్సర్లు అన్న వారు పరిస్థితిని కంట్రోల్ చేయటానికి.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేలా వ్యవహరించాలే తప్పించి.. వారే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లుగా.. వివాదాన్ని మరింత ముదిరేలా వ్యవహరిస్తున్నప్పుడు.. వారిని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ఎందుకు కామ్ గా ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మంచు మనోజ్.. విష్ణు వర్గీయుల మధ్య దాడులు జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి.. పహాడీ షరీఫ్ ఇన్ స్పెక్టకర్ గురువా రెడ్డి అక్కడే ఉన్నారు.దాడి జరిగిన తర్వాత బౌన్సర్లను అడ్డుకోకుండా మీడియాప్రతినిధులు.. ఇతరులను గేటు బయటకు పంపటం దేనికి నిదర్శనం? అసలు శాంతి భద్రతల సమస్య కానీ.. న్యూసెన్సు కానీ ఎవరి వల్ల ఉత్పన్నమైంది? కుటుంబంలో వివాదం ఉంటే.. నాలుగు గోడల మధ్య చూసుకోవాలే తప్పించి.. వీధుల్లోకి వచ్చి కిందా మీదా పడుతుంటే.. వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా?
ఆదివారం నుంచి సాగుతున్న ఈ ఎపిసోడ్ నేపథ్యంలో ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ లేదంటే మంచు ఫ్యామిలీ కాబట్టి.. వారికి ప్రత్యేక ప్రివిలైజ్ లు ఉంటాయి కాబట్టి మరోచోటుకు తీసుకెళ్లి.. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది కదా? అలా ఎందుకు చేయలేదు. సామాన్య ప్రజల మాదిరే పోలీసులు సైతం టీవీల్ని కళ్లకు అప్పగించి ఎందుకుచూసినట్లు. సరే.. కింది స్థాయి అధికారులు అంత పెద్ద స్థాయి ఉన్న వారి మీద చర్యలు తీసుకునే సాహసం చేయలేరనే అనుకుందాం? మరి.. ఉన్నత పోలీసులు అధికారులు ఏం చేస్తున్నట్లు? మంచు ఇంటి రచ్చను వీధుల్లోకి వచ్చేస్తున్నప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఈ వైఫల్యం వెనుకున్న అసలు కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. మరి..వీటికి సమాధానం చెప్పేవారెవరు?