హైదరాబాద్ నుంచి విజయవాడ.. ఖమ్మంలకు ప్రయాణాలు వద్దు
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్ కీలక సూచన చేశారు.
By: Tupaki Desk | 2 Sep 2024 4:18 AM GMTభారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్ కీలక సూచన చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం పట్టణాలకు వెళ్లాల్సిన వారు తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలకు ఇప్పుడు అనువు కాదని పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే మాత్రం.. ప్రత్యామ్నాయ రూట్ ను ఆయన వెల్లడించారు. ఆ దిశగానే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో విజయవాడకు వెళ్లాలనుకునే వారు చౌటుప్పల్.. చిట్యాల.. నార్కెట్ పల్లి.. నల్గొండ.. మిర్యాలగూడ.. పిడుగురాళ్ల.. గుంటూరు మీదుగా వెళ్లాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఖమ్మం వెళ్లాలనుకుంటే మాత్రం చౌటుప్పల్.. చిట్యాల.. నకిరేకల్.. అర్వపల్లి.. తుంగతుర్తి.. మద్దిరాల.. మర్రిపేట బంగ్లా మీదుగా వెళ్లాలని చెప్పారు.
అత్యవసర పరిస్థితి ఎదురైతే సాయం కోసం ఒక హెల్ప్ లైన్ ను ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా చిల్లకల్లు.. నందిగామ దగ్గర నేషనల్ హైవే మీదకు నీళ్లు రావటం.. పాలేరు నది పొంగటం.. సూర్యాపేట తర్వాత రామాపురం క్రాస్ రోడ్ బ్రిడ్జి కూలటం లాంటి పరిస్థితుల నేపథ్యంలో విజయవాడకు వయా సూర్యాపేట వైపు వెళ్లకూడదని స్పష్టం చేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవటం ఉత్తమమని పేర్కొన్నారు. ఎంతో ముఖ్యమైతే తప్పించి మాత్రం ప్రయాణాలు పెట్టుకోవాలని చెబుతున్నారు. ట్రాఫిక్ హెల్ప్ లైన్ లో భాగంగా 9010203626 నెంబరును సంప్రదించాలని పేర్కొన్నారు. సో.. హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వెళ్లాలనుకునే వారు జర జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. పోలీసుల సూచనల్ని పాటించండి.