Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మేయర్‌కు పోలీసుల ఝలక్..! ఏం జరిగిందంటే...

దసరా పండుగ వేళ హైదరాబాద్ మేయర్‌కు పోలీసులు ఝలక్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:05 AM GMT
హైదరాబాద్ మేయర్‌కు పోలీసుల ఝలక్..! ఏం జరిగిందంటే...
X

దసరా పండుగ వేళ హైదరాబాద్ మేయర్‌కు పోలీసులు ఝలక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు పండుగ సంబరాలు కొనసాగుతుంటే.. పోలీసులు మాత్రం మేయర్‌కు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఈ న్యూస్ విన్న మేయర్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ముఖ్యంగా నగర ప్రజల కోసం.. నగరాన్ని కాపాడుకునేందుకు జీహెచ్ఎంసీ పలు రకాల నిబంధనలు తీసుకొస్తూ ఉంటుంది. అందులోభాగంగా ఇటీవల మహానగరం క్లీన్‌సిటీ కోసం వాల్ పోస్టర్లు అంటించడం, వాల్ రైటింగ్స్‌ రాయడాన్ని నిషేధించింది. అయితే.. నగర ప్రజలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన మరో నిబంధనే ఇప్పుడు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి షాక్‌నిచ్చింది.

పై రెండు నిబంధనలతో పాటు ఇటీవల మరో కొత్త నిబంధనను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. సిటీలో అధిక డెసిబుల్ స్పీకర్ సిస్టమ్స్, డీజే వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలిచ్చారు. పండుగల సందర్భంలో అయినా.. మరే ఇతర బహిరంగ సభలైనా.. ఏ కార్యక్రమాలైనా వీటిని వినియోగించవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు. రూల్స్ అందరికీ వర్తిస్తాయని, ఎవరు అతిక్రమించినా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పేర్కొన్నారు.

ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చి వారం రోజులు గడుస్తోంది. ఈ నిబంధనలను మేయర్ విజయలక్ష్మి విస్మరించారు. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మేయర్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే.. ఇక్కడి వేడుకల కోసం పెద్ద సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పెద్దపెద్ద సౌండ్స్‌తో నిబంధనలను ఉల్లంఘించారు. అయితే.. అనుమతికి మించి డెసిబుల్ సిస్టం వాడినట్లుగా ఆరోపణలు రావడంతో మేయర్‌పై బంజారాహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఏదైనా మనవరకు వస్తే గానీ తెలియదు అన్నట్లుగా.. కేసు నమోదు కావడంతో మేయర్ కూడా మాట మార్చేశారు. కమినర్ నిబంధనలను తప్పుపట్టారు. కానీ.. పోలీసులు మాత్రం నిబంధనలు అందరికీ ఒకే తీరు.. చట్టాలు అందరికీ ఒకే రకం.. అన్నట్లుగా నిరూపించారని పొలిటికల్ సర్కిల్‌లో కామెంట్లు వినిపిస్తున్నాయి.