Begin typing your search above and press return to search.

నెల్లూరు పెద్దారెడ్డికి సిట్ కష్టాలు.. ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో అరెస్టు తప్పదా?

2021లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావెల్ కొల్లగొట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   6 March 2025 3:16 PM IST
నెల్లూరు పెద్దారెడ్డికి సిట్ కష్టాలు.. ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో అరెస్టు తప్పదా?
X

కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలు ఎవరినీ వదిలిపెట్టేలా లేరని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని, జోగి రమేశ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారిపై కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో మాజీ మంత్రి, నెల్లూరు పెద్దారెడ్డి కాకాణి గోవర్దన్ రెడ్డిపై ఫోకస్ చేసింది. గతంలో ఆయనకు వ్యతిరేకంగా నమోదైన ఫోర్జరీ కేసుపై దర్యాప్తునకు రెండు రోజుల క్రితం సిట్ వేసింది. పది మంది పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కాకాణిపై ఉచ్చు బిగించేలా కదులుతోందని ప్రచారం జరుగుతోంది.

2021లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావెల్ కొల్లగొట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి సంబంధం ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటం, సర్వేపల్లి శాసనసభ్యుడిగా మంత్రిగా కాకాణి ఉండటంతో ఆయనపై చర్యలకు పోలీసులు వెనకడుగు వేశారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో తేల్చాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించడం.. కేసు పెట్టిన ఎంపీ మాగుంట కూడా టీడీపీలోనే ఉండటంతో కాకాణికి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది.

సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావెల్ తరలించిన విషయమై అప్పట్లో ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఉద్యమించారు. ఆయన పోరాటం వల్లే అప్పట్లో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో పోలీసులు ఎంపీ మాగుంటను కూడా నిందితుడిగా చూపుతూ ఆయనకు నోటీసులిచ్చారు. ఆయన పేరుతో గ్రావెల్ తరలించడంతో పోలీసులు ఆయనను నిందితుడిగా చేర్చాల్సివచ్చిందని చెబుతున్నారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు నోటీసులు అందుకున్న మాగుంట కంగుతిన్నారు. తనకు తెలియకుండా తన పేరుతో గ్రావెల్ ఎలా తరలిస్తారని పోలీసులు, మైనింగు అధికారులను నిలదీశారు. దీంతో సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి మట్టిని తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని మాగుంట రాసిన లేఖ బయటపడింది. అయితే ఆ లేఖలో ఉన్న సంతకం తనది కాదని గ్రహించిన మాగుంట వెంటనే ఫోర్జరీ కేసు పెట్టారు. అయితే అప్పటి మంత్రి కాకాణి ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని కోట్లాది రూపాయల గ్రావెల్ కొల్లగొట్టిన కాకాణిని వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. బాపట్ల ఎస్పీ పర్యవేక్షణలో బాపట్ల డీఎస్పీ విచారణాధికారిగా పది మంది పోలీసు అధికారులతో సిట్ వేసింది. ప్రభుత్వ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన సిట్ పోలీసులు, వెంకటాచలం పోలీసుస్టేషన్ తోపాటు నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలోనూ రికార్డులను స్వాధీనం చేసుకుంది. మాగుంట సంతకాలను ఫోర్జరీ చేసింది ఎవరు? అనే విషయమై లోతుగా దర్యాప్తు జరుపుతోంది. అయితే ఈ కేసులో అన్నివేళ్లూ మాజీ మంత్రి కాకాణినే చూపుతున్నాయని అంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ కాకాణి అంటూ ప్రచారం జరుగుతోంది.