పుష్ప-2 ఘటన... రేవంత్ కు వ్యతిరేకంగా పోస్టులపై పోలీసు యాక్షన్ స్టార్ట్!!
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై రాజకీయంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 18 Dec 2024 5:34 AM GMTసంధ్య థియేటర్ లో "పుష్ప-2" సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోపక్క ఇప్పటికే ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసింది!!
అయితే... ఈ విషయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ బీఆరెస్స్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వేదికపై రేవంత్ పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా.. ఇది చాలా అన్యాయం అంటూ బీఆరెస్స్ నేతలు సెటైర్లు వేస్తున్నారని అంటున్నారు.
మరోపక్క... అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. అదే రోజు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో... ఈ మధ్యంతర బెయిల్ వ్యవహారంపై పోలీసులు హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. ఈ సమయంలో మరో కీలక విషయం తెరపైకి వచ్చింది.
అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై రాజకీయంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో... ఇందులో పార్టీకి ఏమీ సంబంధం లేదు.. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది.. చట్టం ముందు అంతా సమానమే అని రేవంత్ కామెంట్ చేశారు.
మరోపక్క... అల్లు అర్జున్ అరెస్ట్ పై రాజకీయ పక్షాల నుంచి రేవంత్ పై విమర్శలు వస్తున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చర్చా మొదలైంది. ఈ సందర్భంగా రేవంత్ ను టార్గెట్ చేస్తూ ఈ పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. దీనిపై పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో.. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. వీరిపై ఐటీ యాక్ట్ తో పాటు బీ.ఎన్.ఎస్. 352, 353 (1)(బి) సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు చెందిన పలువురు ఫ్యాన్స్ తో పాటు బీఆరెస్స్ శ్రేణులూ ఈ తరహా పనికి ఒడిగట్టారని అంటున్నారు. దీంతో... త్వరలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అరెస్టూ తప్పదనే కామెంట్లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయాలపై సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.