Begin typing your search above and press return to search.

నటి జయప్రద ఎక్కడ?... వెతుకుతున్న పోలీసులు!

గతకొన్ని రోజులుగా మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద కేసుల వ్యవహారం, కోర్టులో విచారణ, అరెస్టు అంటూ రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Dec 2023 10:20 AM GMT
నటి జయప్రద ఎక్కడ?... వెతుకుతున్న  పోలీసులు!
X

గతకొన్ని రోజులుగా మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద కేసుల వ్యవహారం, కోర్టులో విచారణ, అరెస్టు అంటూ రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కార్మికుల నుంచి ఈ.ఎస్.ఐ. రూపంలో డబ్బులు వసూలు చేశారని, అనంతరం వాటిని తిరిగి చెల్లించలేదని గతంలో చెన్నైలో ఒక కేసు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యూపీలో మరో కేసు విషయంలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో జయప్రద మిస్సింగ్ అని తెలుస్తుంది

అవును... జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. 2019 లోక్‌ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌ లోని రాంపూర్‌ కోర్టు ఆమెకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు విచారణ జరగ్గా... ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈ విషయాన్ని న్యాయస్థానం సీరియస్ గా తీసుకుంది.

2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమె... విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించారు. అయినప్పటికీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఆమెను అరెస్ట్ చేయడం కోసం ఉత్తర ప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో ఆ బృందం జయప్రదను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా... ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని తెలుస్తుంది. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న జయప్రద తప్పించుకు తిరుగుతున్నారని అంటున్నారు. దీంతో ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా వెతికే పనిలో ఉన్నారని సమాచారం.

కాగా... 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులపై నవంబర్‌ 8న విచారణ జరగాల్సి ఉండగా.. జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. ఈ అంశంపై ప్రోసక్యూషన్‌ ఆఫీసర్‌ అమర్‌ నాథ్‌ తివారీ మాట్లాడుతూ.. జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినా ఆమె నవంబర్‌ 8న కోర్టుకు హాజరు కాలేదని తెలిపారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది.

అయినా కూడా నవంబర్ 17న ఆమె కోర్టుకు హాజరుకాలేదు. ఆపై డిసెంబర్‌ నెలలో హాజరు కావాలని హెచ్చరించినా కూడా ఆమె అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌ గా పరిగణలోకి తీసుకుంది. ఇందులో భాగంగా... జనవరి 10లోగా ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో జయప్రదను అదుపులోకి తీసుకోవాలని ప్రత్యేక టీం ప్రయత్నిస్తుండగా.. ఆమె మిస్సింగ్ అని తెలుస్తుంది.