Begin typing your search above and press return to search.

సీన్ రిపీట్: ఢిల్లీ వీధుల్లో స్పైడర్ మ్యాన్ అరెస్టు

సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. పాపులార్టీ కోసం పిచ్చి పనులు చేసే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

By:  Tupaki Desk   |   25 July 2024 4:35 AM GMT
సీన్ రిపీట్: ఢిల్లీ వీధుల్లో స్పైడర్ మ్యాన్ అరెస్టు
X

సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. పాపులార్టీ కోసం పిచ్చి పనులు చేసే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పలు సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్న పరిస్థితి. పది మందిలో గుర్తింపు కోసం ప్రమాదకరమైన పనులకు పాల్పడే వారి తీరు విచిత్రంగా ఉండటం చూస్తుంటాం. అలాంటి కోవలోకే వస్తాడు ఢిల్లీ స్పైడర్ మ్యాన్. సినిమాల్లో చూపించినట్లుగా స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ను ధరించే ఇతడు.. కోతి పనులు చేస్తుంటాడు. ప్రమాదకర ఫీట్లు చేస్తూ రీల్స్ చేస్తుంటాడు.

గతంలోనూ ఈ తరహా కోతి పనులతో ఒకసారి అరెస్టు అయినప్పటికి బుద్ధి రాలేదు. తాజాగా అతడ్ని మరోసారి అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. 20 ఏళ్ల ఆదిత్య అనే కుర్రాడికి స్పైడర్ మ్యాన్ మాదిరి దుస్తులు ధరించి.. పిచ్చి పనులు చేస్తూ.. రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. తాజాగా తన స్నేహితుడు గౌరవ్ సింగ్ తో కలిసి చేసిన పనికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతడ్ని అరెస్టు చేశారు.

ఎప్పటిలానే స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ను ధరించిన ఆదిత్య కారు బానెట్ మీద నిలబడి ప్రమాదకర స్టంట్లు చేశాడు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వీరు చేసిన ఘనకార్యాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. వారిద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. కేసులు నమోదు చేశారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నందుకు వారికి జైలు.. జరిమానా ఖాయమంటున్నారు.

గతంలోనూ ఒక అమ్మాయితో కలిసి ఆదిత్య స్పైడర్ మ్యాన్ డ్రెస్ తో చేసిన పిచ్చి పనికి సంబంధించిన వీడియో వైరల్ కావటం తెలిసిందే. అప్పట్లోనూ ప్రమాదకర స్టంట్లకు పాల్పడి అరెస్టు అయ్యాడు. ఒకసారి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఇదే తీరును ప్రదర్శిస్తున్న ఆదిత్య తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఫేమ్ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిన పని లేదని.. నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయొద్దని చెబుతున్నారు.అయినప్పటికీ అతడిలో మాత్రం మార్పు రాని పరిస్థితి.