Begin typing your search above and press return to search.

ఇదెక్కడి దొంగల ముఠా.. ఒక్కో పిల్లాడి చదువుకు రూ.8 లక్షలు!

పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి.

By:  Tupaki Desk   |   19 Jun 2024 10:46 AM GMT
ఇదెక్కడి దొంగల ముఠా.. ఒక్కో పిల్లాడి చదువుకు రూ.8 లక్షలు!
X

ఇప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు చేసేవారు ఎక్కువైపోయారు. ఈజీ మనీకి అలవాటుపడ్డవారు అంతే తెలివిగా మోసాల్లోనూ ఆరితేరిపోతున్నారు. తక్కువ ధరకే బంగారం అంటూ పలువురిని దోచుకుంటున్న ముఠాను హైదరాబాద్‌ రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి.

నెల్లూరులోకి కావలికి చెందిన కాడెద్దుల విజయ్‌ కుమార్‌ అలియాస్‌ మహేశ్‌ చౌదరి.. సెంథిల్, హరీశ్, ఓం సాయికిరీటి వంటివారితో ముఠాకట్టాడు. వీరు సినిమా షూటింగుల కోసమంటూ నకిలీ బంగారం బిస్కెట్లను, నకిలీ కరెన్సీని పంజాబ్‌ లో తయారు చేయిస్తున్నారు. ఆ తర్వాత వీటిని కస్టమర్లకు అంటగట్టి మోసం చేస్తున్నారు. కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేసిన బంగారమని.. తక్కువ ధరకే ఇస్తున్నామని మాయమాటలు చెప్పి నకిలీ బంగారాన్ని అసలైన బంగారమంటూ అంటకడుతున్నారు.

కస్టమర్లు ఈ ముఠాను సంప్రదించినప్పుడు వారికి అనుమానం రాకుండా ఈ దొంగల ముఠాలోని సభ్యులే కస్టమర్లలాగా వచ్చి భారీ ఎత్తున వీరి వద్ద బంగారాన్ని కొంటారు. దీంతో కస్టమర్టు కూడా వారిని చూసి తక్కువకే బంగారం వస్తుందని.. భారీగా డబ్బు చెల్లించి బంగారాన్ని కొంటున్నారు. తర్వాత ఆ బంగారంతో వెళ్తున్నప్పుడు ఈ ముఠాకు చెందిన వ్యక్తులు దారికాచి.. తాము పోలీసు అధికారులమని.. ఈ బంగారానికి బిల్లులు లేవని బెదిరించి ఆ నకిలీ బంగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు.

ఇలా మహేశ్‌ చౌదరి ముఠా పలువురు కస్టమర్లను మోసగించింది. ఇలా బంగారమంటూ నకిలీ బంగారాన్ని అంటగట్టి మహేశ్‌ చౌదరి బృందం భారీగా దోచుకుంది.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన మహేశ్‌ చౌదరి తన పిల్లలు ముగ్గురిని చెన్నైలో ఒక కార్పొరేట్‌ స్కూళ్లో చదివిస్తుండటం విశేషం. ఒక్కొక్కరికి రూ.8 లక్షల ఫీజు చెల్లిస్తున్నాడు. అలాగే కావలిలో ఇంద్రభవనాన్ని తలపించేలా ఇల్లు కూడా కట్టాడని పోలీసుల విచారణలో తేలింది.

మహేశ్‌ చౌదరి మీద నెల్లూరులో ఇప్పటికే రౌడీషీట్‌ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. నకిలీ బంగారంతో భారీగా దోచుకున్న డబ్బును రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా మోసం ఎంత సంపాదించాడు? ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు? ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు? సూత్రధారులు– పాత్రధారులెవరు అని పోలీసులు నిగ్గు తేలుస్తున్నారు.

ముగ్గురు పిల్లలను చెన్నైలోని కార్పొరేట్‌ పాఠశాలలో ఒక్కొక్కరికి రూ.8 లక్షలు ఫీజుకట్టి మహేశ్‌ చదివిస్తుండటంపై పోలీసులు దృష్టి సారించారు. ఆ డబ్బు కూడా ఇలా కస్టమర్లకు నకిలీ బంగారాన్ని అంటగట్టి సంపాదించిందేనని భావిస్తున్నారు.