నారా లోకేశ్ కాన్వాయ్ లో తనిఖీలు.. అందుకేనా?
ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్ ను తనిఖీ చేయడం కలకలం రేపింది.
By: Tupaki Desk | 20 March 2024 2:59 PM GMTఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో అధికారులు ఎన్నికల కోడ్ ను పటిష్టంగా అమలు చేసే పనుల్లో ఉన్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్ ను తనిఖీ చేయడం కలకలం రేపింది.
ప్రస్తుతం తాను పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గంపైనే నారా లోకేశ్ దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. పలు వర్గాలతో సమావేశాలు జరుపుతున్నారు. వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కూడా ఉంటున్నాయి.
అలాగే పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్ల వాసులతోనూ లోకేశ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్’ పేరుతో వారితో భేటీలు జరుపుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు.
ఇందులో భాగంగా నారా లోకేశ్ యథావిధిగా మార్చి 20న కూడా ఉండవల్లి నివాసం నుంచి మంగళగిరికి మూడు కార్ల కాన్వాయ్ తో బయలుదేరారు. అయితే ఉన్నట్టుండి రోడ్డుపైనే పోలీసులు ఆయన కార్లను ఆపేశారు. దీంతో పోలీసులు తనను అడ్డుకుంటున్నారని ఆయన భావించారు. అయితే ఎన్నికల కోడ్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పడంతో ఆయన వారికి పూర్తిగా సహకరించారు.
దాదాపు 20 నిమిషాలపాటు నారా లోకేశ్ మూడు కార్ల కాన్వాయ్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతసేపు లోకేశ్ కారు దిగి రోడ్డుపైనే ఉండి తనిఖీలకు సహకరించారు. మూడు కార్లను క్షుణ్నంగా తనిఖీలు చేసిన అధికారులకు తనిఖీల్లో ఎలాంటి ధనం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఇతర వస్తువులేమీ లభించలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. నారా లోకేశ్ మంగళగిరి వైపు తన కాన్వాయ్ లో సాగిపోయారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు, పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా అనుమానమొచ్చిన ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. ఇందుకు రాజకీయ నేతలకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. ఇందులో భాగంగానే నారా లోకేశ్ కాన్వాయ్ లో తనిఖీలు చేపట్టారు.