దారుణం.. ప్రయాణికుడి తలపై తన్నిన పోలీస్.. వీడియో!
ఈ ఘటనపై పలువురు నిరసన తెలిపారు.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
By: Tupaki Desk | 25 July 2024 11:19 AM GMTబ్రిటన్ లోని మాంచెస్టర్ ఎయిర్ పోర్ట్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ సిబ్బందిపై దాడికి దిగారంటూ నలుగురు ప్రయాణికులపై లండన్ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. వారి తలపై తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. ఈ అమానుష ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలువురు నిరసన తెలిపారు.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అవును... బ్రిటన్ లోమి మంచెస్టర్ విమానాశ్రయంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీస్.. ఓ ప్రయాణికుడిని నేలపై పడేసి తలపై తన్నుతున్నట్లు కనిపించింది. ఈ సమయంలో ఇతర పోలీసులు ఎవరూ అతడిని ఆపడం కానీ, ప్రయాణికుడిని లేపడం వంటి పనులు కాని చేయకపోవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.
వివరాళ్లోకి వెళ్తే... మాంచెస్టర్ విమానాశ్రయంలోకి వచ్చిన నలుగురు ప్రయాణికులకు అకక్డున్న ఎమర్జెన్సీ సిబ్బందితో ఓ విషయమై వాగ్వాదం చోటు చేసుకుందట. ఆ వాగ్వాదం కాస్త ముదిరి ఘర్షణకు దారి తీసిందని చెబుతున్నారు. దీంతో.. ఆ నలుగురూ సిబ్బందిపై దాడికి దిగినట్లు చెబుతున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్రహానికి గురై... ఆ ప్రయాణికులతో దారుణంగా ప్రవర్తించారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ ప్రయాణికుడి కళ్లల్లోకి పెప్పర్ స్ప్రే కూడా కొట్టాడు. ఈ పరిస్థితులతో ఎయిర్ పోర్ట్ లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలోనే ప్రయాణికులతో క్రూరంగా ప్రవర్తించిన పోలీసుల్లో ఓ పోలీసు.. ఓ వ్యక్తిని నేలపై అదిమిపెట్టి, అతడి తలపై కాళ్లతో తన్నాడు. దీంతో.. అక్కడున్నవారంతా పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
దీంతో... ఈ ఘటనపై మాంచెస్టర్ పోలీసు అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా... ప్రయాణికులు చేసిందీ తప్పే.. వారితో ముగ్గురు పోలీసులు ప్రవర్తించిన తీరూ తప్పే అని అన్నారు. ఈ ఘటనలో పోలీసుల తీరు ఆందోళన కలిగిస్తోందని.. ఇరువర్గాల దాడిలో ఓ మహిళా పోలీసు ముక్కుకు తీవ్ర గాయం అయ్యిందని.. ఈ చర్యలను పాల్పడిన పోలీసును సస్పెండ్ చేశామని.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు.
మరోపక్క... రోచ్ డేల్ లోని గ్రేటర్ మాంచెస్టర్ డివిజినల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెలుపల వందలాది మంది ప్రజలు గుమిగూడారు. మాంచెస్టర్ విమానాశ్రయంలో ఓ పోలీస్ అధికారి.. ఓ ప్రయాణికుడి తలపై తన్నినట్లు ఉన్న వీడియో బయటకు రావడంతో వీరంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనిఫాం లో ఉన్న గ్యాంగ్ స్టర్లు అంటూ వారు నినాదాలు చేశారని తెలుస్తోంది.