Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు

తాజాగా బిగ్ బాస్ యాజమాన్యం ఎండమాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 5:08 AM GMT
బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు
X

తెలుగు వెర్షన్ బిగ్ బాస్ సీజన్ 7కు 'ఉల్టాపల్టా' ట్యాగ్ పెట్టటం తెలిసిందే. ఈ సీజన్ ఆరంభం నుంచి ఉల్టాపల్టా థీమ్ తో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన బిగ్ బాస్ నిర్వాహకుల పరిస్థితి కూడా ఇప్పుడు ఉల్టాపల్టా మాదిరి మారింది. గడిచిన ఆరు సీజన్ లలో ఎప్పుడూ లేని రీతిలో సీజన్ 7 ఫైనల్ రోజున షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద చోటు చేసుకున్న రచ్చ.. ఆరు ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేసిన అల్లరిమూక ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

అంతేకాదు.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి అటు ఆర్టీసీ వర్గాలు.. ఇటుపోలీసులు సీరియస్ గా ఉన్నారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించినందుకు బిగ్ బాస్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్ ను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు పంపటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ విజేతపై చర్యలు తీసుకోవటానికి ముందు నిర్వాహకుల్ని ప్రశ్నించరా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. తాజాగా బిగ్ బాస్ యాజమాన్యం ఎండమాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోలోనిర్వహించిన ఫైనల్ నేపథ్యంలో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అభిమానులకు.. రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ అభిమానులకు మధ్య వివాదం చోటు చేసుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా అమర్ దీప్ కారుతో పాటు.. మరో కంటెస్టెంట్ కారు అద్దాల్ని ధ్వంసం చేవారు. పోలీసుల వాహనాలతో పాటు..ఆర్టీసీ బస్సుల అద్దాల్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా మూడు కేసులు నమోదు చేశారు.

తాజాగా పంపిన నోటీసుల్లో నాలుగు ప్రశ్నలతో జూబ్లీహిల్స్ పోలీసులు పంపినట్లుగా తెలిసింది. ఈ నోటీసులను అన్నపూర్ణ స్టూడియోలోని బిగ్ బాస్ సంస్థ టెంపరరీ ఆఫీసు మేనేజర్ కు అందజేశారు. ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు వస్తారని తెలిసినప్పుడు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు. అభిమానుల్ని రావొద్దని ముందుగా హెచ్చరించారా? వారిని ఎలా అప్రమత్తం చేశారు? షో నిర్వహణకు సంబంధించి సెన్సార్ బోర్డు అనుమతులు ఉన్నాయి? అంటూ సదరు నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ నోటీసులు జారీ చేశారు. మరి.. దీనికి బిగ్ బాస్ యాజమాన్యం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.