పంచాలనుకున్నారు.. పరేషాన్ అయ్యారు.. కోటిన్నర వదిలేసి పరారయ్యారు.. ఎక్కడంటే!
ఇదిలావుంటే.. కొందరు డబ్బులు తెచ్చి కూడా.. ఎన్నికల సంఘం నిఘా నేపథ్యంలో ఆ నిధులను, కారును కూడా వదిలేసి వెళ్లిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా మొత్తం కోటిన్నర రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
By: Tupaki Desk | 13 May 2024 3:56 AM GMTఎన్నికల వేళ ఓటుకు నోట్ల పంపకం కామన్ అయిపోయింది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండడం ప్రధాన పార్టీలన్నీ కూడా.. ఈ ఎన్నికలను ప్రాణం కన్నా ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రచారం ముగిసిన శనివారం సాయంత్రం నుంచి ఒక, అసలు కథ మొదలైంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున ఓటుకు ఇంతని పంపకాలు ప్రారంభించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధంగా ఈ ఓటుకు నోటు పంపకాలు సాగాయి. కొన్ని చోట్ల వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి.
కొందరికే ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకపోవడం.. గుంటూరులోను, విశాఖలోనూ, తిరుపతిలోనూ వివాదం అయింది. ఇక, విజయవాడలో అయితే.. మాస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కథ పోలీసు స్టేషన్ వరకు కూడా నడిచింది. దీంతో నాయకులు తలలు పట్టుకున్నారు. ఇదిలావుంటే, విశాఖలో మరో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. విశాఖలోనూ కీలక స్థానాల్లో కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. తూర్పు నుంచి పోటీలో ఉన్న ఎంవీవీ సత్యనారాయణ కుబేరుడుగా పేరొందారు. ఇతర నియోజకవర్గాల్లోనూ కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు.
దీంతో శనివారం రాత్రి నుంచే విశాఖనగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాలు సహా.. గాజవాక, భీమిలిలోనూ పంపకాలు జరిగాయని సమాచారం. ఇదిలావుంటే.. కొందరు డబ్బులు తెచ్చి కూడా.. ఎన్నికల సంఘం నిఘా నేపథ్యంలో ఆ నిధులను, కారును కూడా వదిలేసి వెళ్లిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా మొత్తం కోటిన్నర రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ అర్.కే బీచ్ సమీపంలోని పాండురంగా పురం వద్ద డబ్బులు పంచుతున్న విషయాన్ని కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్కడకు వచ్చిన పోలింగ్ సిబ్బంది పోలీసులు.. పంచుతున్న యువకులను పట్టుకునే ప్రయత్నం చేశారు.
అయితే.. అప్పటికే అప్రమత్తమైన వారు.. కారుతో పాటు నిధులను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కారులో మొత్తం కోటిన్నర రూపాయలుఉన్నట్టు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారును.. స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. నగదును ఐటీ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై కారు నెంబరు ఆధారంగా విచారణ చేస్తున్నారు.