Begin typing your search above and press return to search.

మేటర్ సీరియస్... భారీ సంఖ్యలో వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు...!

అవును... తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 5:18 PM GMT
మేటర్  సీరియస్... భారీ సంఖ్యలో వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు...!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 85 మంది వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనుమానితులకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఉన్నతాధికారుల సూచనలతో మంగళగిరి రూరల్ పోలీసులు 85 మంది వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో 105 మందిపై కేసు నమోదు అయ్యింది. అయితే వీరిలో 25 మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు.

ఇలా ఆగస్టు 21న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించినా సుమారు 85 మంది హాజరుకాకపోవడంతో... తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఈ కేసులో భాగంగా ఇప్పటికే కొంతమంది వైసీపీ కీలక నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మరికొంతమంది ఈ నోటీసులు అందుకోకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని అంటున్నారు.

దీంతో... అలాంటివారిపై ఏపీ పోలీసుల నిఘా కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలక గన్ మెన్ ల వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇదే క్రమంలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన రోజు తమ ఆఫీసులో సీసీటీవీ రికార్డులను సమర్పించాలని వైసీపీకి పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.

ఈ నోటీసులపై స్పందించిన వైసీపీ... టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కేసులో ప్రభుత్వం కావాలనే వైసీపీ నేతల పేర్లు చేర్చుతుందని విమర్శించింది.

కాగా అక్టోబర్ 19 - 2021న టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇదే క్రమంలో... ఈ దాడి వెనుక గత ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నట్లు టీడీపీ ఆరోపించింది. ఈ దాడికి సంబంధించిన కుట్ర వైసీపీ ఆఫీసులోనే జరిగిందంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.