చేతులు కలపనున్న.. బాబాయ్.. అబ్బాయ్! .. రాజకీయం అంతే బ్రో!
ఈ నేపథ్యంలో తాజాగా అజిత్ వర్గంలో ఎన్సీపీ కలిసి పోతుందని.. అంటున్నారు నాయకులు.
By: Tupaki Desk | 3 Jan 2025 8:30 AM GMTరాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు కాదు. ఎవరూ శాశ్వత మిత్రులు కాదు. దీనికి నాయకులే కాదు.. పార్టీలు కూడా అతీతం కాదు. ఈ దేశంలో అనేక పార్టీలు విడిపోయి.. కలుసుకున్న సందర్భాలు ఉన్నా యి. అవకాశం-అవసరం.. అనే రెండు పట్టాలపైనే ఏ రాజకీయ రైలు బండి అయినా ప్రయాణం చేస్తుంది. 2010లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి అధికారంలోకి వచ్చాయి. తొలుత జేడీఎస్ నేత కుమార స్వామి సీఎం అయ్యారు. ఒప్పందం ప్రకారం.. రెండున్నర మాసాల తర్వాత ఆయన సీఎంగా తప్పుకొని కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి.
కానీ, ఇక్కడే ఆయన యూటర్న్‌తీసుకున్నారు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని పార్టీని 'నాది' అంటూ ఆయన ఓన్ చేసుకున్నారు. అంతేకాదు.. ఒప్పందం చేసుకున్నది దేవెగౌడ కాబట్టి ఆయనను అడగాలన్నారు. ఈ క్రమంలో దేవెగౌడ స్పందించి.. ''వాడు నా కొడుకు కాదు.. రాజకీయ శత్రువు'' అని వ్యాఖ్యానించారు తప్ప.. ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలని మాత్రం పెద్ద నాయకుడిగా ఆయన తీర్పు చెప్పలేక పోయారు. తర్వాత.. కొన్నాళ్లకు మళ్లీ తండ్రీ కొడుకులు కలిసిపోయారు.
కట్ చేస్తే.. ఇప్పుడు కూడా అలాంటి పరిణామమే కాస్త భిన్నంగా మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్. అయితే.. ఏడాదిన్నర కిందట.. ఈ పార్టీకే చెందిన ఆయన తమ్ముడి కొడుకు అజిత్ పవార్.. పార్టీని చీల్చారు. 32 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి.. బీజేపీతో చేతులు కలిపి అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఇక, ఎన్సీపీ పై కోర్టులు కూడా జోక్యం చేసుకుని అజిత్‌కే మద్దతు ఉంది కాబట్టిఆయనదే పార్టీ అని చెప్పాయి.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరువురు నాయకులు వేర్వేరుగా రాజకీయాలు చేసుకున్నారు. కానీ, ఇండియా కూటమి దెబ్బతినడంతో శరద్ పవార్ ఇప్పుడు సన్నగిల్లారు. బీజేపీవైపు చూస్తున్నారు. ఇటీవల ప్రధానిని కూడా ఆయన కొనియాడారు. ఈ నేపథ్యంలో తాజాగా అజిత్ వర్గంలో ఎన్సీపీ కలిసి పోతుందని.. అంటున్నారు నాయకులు. ఈ విషయంపై ఇరు వర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా.. 'కలసి ఉంటే కలదు సుఖం' అనే రాగం అందుకున్నారు. ఇక, అజిత్ మాతృమూర్తి ఆశాథాయి కూడా.. ఇరు పక్షాలు కలిసిపోవాలని పండరి నాథుడైన విఠలుడిని వేడుకుంటున్నట్టు చెప్పడం గమనార్హం.