రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో పొలిటికల్ మంటలు.. ఏం జరిగింది?
గతంలోనూ ఇక్కడ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 Oct 2024 6:45 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రాజకీయం గరంగరంగా మారిపోయింది. ఇక్కడి ఆయన సానుభూతి పరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఆ పార్టీ కీలక నాయకుడు కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. గతంలోనూ ఇక్కడ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో కొడంగల్‌లో అసలు ఏం జరుగుతోందన్న చర్చ తెరమీదికి వచ్చింది.
ఎవరెవరు చేరారు?
కొడంగల్ నియోజకవర్గంలో కీలకమైన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, ఆయన అనుచరులు సహా మరికొందరు రేవంత్‌రెడ్డి అనుచరులుగా ఉన్నవారు కూడా కాంగ్రెస్‌ను వీడి కారెక్కారు. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ నర్మద కూడా కారెక్కడం గమనార్హం. అయితే.. దీనికి వారు చెబుతున్న కారణాలు చూస్తే.. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డి కోసం తాము ఎన్నికల సమయంలో ఇల్లిల్లు తిరిగామని.. కానీ, తమ వారికే రైతు రుణ మాఫీ కాలేదని ఆరోపించారు. అందుకే పార్టీ మారుతున్నట్టు చెబుతున్నారు.
కాంగ్రెస్ విమర్శలు..
కాగా.. ఈ పరిణామాలపై కొడంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బీఆర్ ఎస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చోటా నేతలను కొనుగోలు చేశారని ఆరోపించారు. వారంతా పార్టీలో పెద్దగా ఉపయోగం లేని నాయకులేనని చెప్పడం గమనార్హం. ఇక, ఈ పరిణామాలపై సీఎం ముఖ్య అనుచరులు సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై వారు పరిశీలన చేపట్టారు. ఒకరిద్దరు నాయకుల కారణంగా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ఈ వ్యవహారాలపై ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు వ్యూహాత్మకంగా బీఆర్ ఎస్ పావులు కదపడంపై రాజకీయంగా చర్చ సాగుతోంది.
అందుకే మా పార్టీలోకి: కేటీఆర్
ఇక, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ నేతలు బీఆర్ ఎస్‌లో చేరడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో ఫార్మా సిటీని నిర్మిస్తామని కేసీఆర్ చెప్పినట్టు రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, కానీ, ఇప్పుడు మాత్రం ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. కొడంగల్‌లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడంతో పార్టీ నాయకులు బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.