Begin typing your search above and press return to search.

వైసీపీ ముందస్తు నిరసనలు...లాభం టీడీపీకేనా ?

టీడీపీ సూపర్ సిక్స్ హామీలనే తీసుకుంటే చివరి రెండేళ్లలో వాటిని అమలు చేస్తే మళ్ళీ టీడీపీ వైపు జనాలు మొగ్గు చూపరని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   28 Dec 2024 3:44 AM GMT
వైసీపీ ముందస్తు నిరసనలు...లాభం టీడీపీకేనా ?
X

పాకన పడినప్పుడే మంచి రుచిగా ఉంటుందని అంటారు. వ్యవహారం కూడా రసకందాయంలో పడుతుంది అని కూడా అంటారు. అదే ఇంకా మొదలులో ఉండగానే కెలికితే లాభం గూబల్లోకి పోయి నష్టాలు కష్టాలే మిగులుతాయని కూడా అనుభవంతో పెద్ద వారు అనే మాట.

వైసీపీ విషయం తీసుకుంటే ఏపీలో అధికార టీడీపీ ప్రభుత్వ రాజకీయం ఇంకా బాగా ముదిరి పాకాన పడకుండానే తొందరపడి కోయిల కూసినట్లుగా నిరసనలతో రోడ్డెక్కిందా అన్న చర్చ వస్తోంది. ఈ విషయంలో పార్టీ వారు కూడా అధినాయకత్వానికి చెప్పి చూసారు అని అంటున్నారు.

జనాలకు ప్రభుత్వం మీద అసంతృప్తి బాగా రావాలని అపుడు జనంలోకి వెళ్తే ఆందోళనలు ఏవైనా విజయవంతమవుతాయని ప్రజలు కూడా పట్టించుకుంటారు అని నాయకులు చెప్పినా కూడా హై కమాండ్ మాత్రం జనంలోకి వెళ్లాల్సిందే ఆందోళలను చేయాలైందే అని హుకుం జారీ చేయడంతో నేతలంతా నిరసనల బాట పట్టారు.

ఇపుడు చూస్తే పార్టీ వారే తప్ప జనాల నుంచి అయితే అనుకున్నంతగా స్పందన రాలేదు. ఎందుకంటే విద్యుత్ చార్జీలు పెంచినా ఆ భారాలను ఇంకా జనాలు మోయలేదు. వారికి అది అనుభవంలోకి రాలేదు అని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం వచ్చి ఇంకా ఆరు నెలల కాలమే అయింది.

ప్రజల చూపులు అన్నీ ప్రభుత్వం మీదనే ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపు అయినా తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమకు మేలు చేసి తీరుతుందన్న భరోసా అయితే ప్రజలలో ఉంది. ఈ సందిగ్ద పరిస్థితులలో ఈ సంధికాలంలో రాజకీయ రచ్చ అన్నట్లుగా వైసీపీ తన శ్రేణులను వీధుల్లోకి పంపించింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విమర్శలు జనాల చెవికి ఎక్కకపోగా ఆరు నెలలలోనే అధికార దాహమా అన్న కొత్త విమర్శలు కూడా వైసీపీ మీదకు వస్తాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే ప్రభుత్వాన్ని వైసీపీ ఈ విధంగా అలెర్ట్ చేస్తోంది అని అంటున్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తే కనుక సరిదిద్దుకునేందుకు ఇది ఒక చాన్స్ అని అంటున్నారు. ప్రభుత్వం ఎటూ నాలుగున్నరేళ్ల పాటు ఉంటుంది. ఈ రోజున చిన్న తప్పులు చేసినా వాటిని దిద్దుకుని జనం ముందుకు మంచిగా వచ్చేందుకు బోలెడంత సమయం ఉంది.

జనాలు కూడా ఎపుడు ఇచ్చారనే చూస్తారు తప్ప మొదటి నుంచి లెక్క వేసుకోరు. టీడీపీ సూపర్ సిక్స్ హామీలనే తీసుకుంటే చివరి రెండేళ్లలో వాటిని అమలు చేస్తే మళ్ళీ టీడీపీ వైపు జనాలు మొగ్గు చూపరని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.

పొరుగున ఉన్న తెలంగాణాలో కేసీఆర్ ఏడాదికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇచ్చారు. ఇంకా కూడా ఇస్తున్నారు ఎందుకంటే జనాలు గగ్గోలు పెట్టినపుడే ఫీల్డ్ లోకి దిగితే అపుడు విలువ గౌరవం చేసే పోరాటాలకు దక్కుతాయని బీఆర్ఎస్ అధినాయకత్వం గుర్తించింది అని అంటున్నారు.

ఇక టీడీపీ కూటమి విషయమే తీసుకుంటే పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. 2025-26 బడ్జెట్ చూసిన తరువాత అయినా వైసీపీ జనంలోకి వస్తే బాగుండేది అని అంటున్నారు మరి వైసీపీ అధినాయకత్వం మాత్రం బాగా తొందరపడుతోంది అంటున్నారు. ఈ తొందర వైసీపీకి రాజకీయ లాభమా లేక టీడీపీ కూటమికా అంటే ప్రస్తుతానికి చూస్తే కూటమికే అని అన్న వారూ ఉన్నారు. చూడాలి మరి జనం ప్రభావం ఏ వైపునకు మళ్ళుతుందో.