Begin typing your search above and press return to search.

శ్రీ విశ్వావసు...రాజకీయ ఆశలు ఊసులు !

ప్రస్తుతం ఉన్న దాని కంటే బ్రహ్మాండమైన కాలం ముందు వస్తుందని రావాలని ఆశిస్తారు. ఆ విధంగా చూస్తే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాన్ని ఏ విధంగా చూస్తుంది, ఏ విధంగా మారుస్తుంది అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   30 March 2025 4:30 PM
శ్రీ విశ్వావసు...రాజకీయ ఆశలు ఊసులు !
X

కొత్తది ఎపుడూ మోజే. ఎప్పుడూ ఏదో తీసుకుని వస్తుందని మనిషి ఆరాటంగా ఉంటుంది. తమ ఆశలను అన్నీ ఒకే దెబ్బకు తీర్చేస్తుందని నమ్ముతారు. అంతే కాదు కష్టాలు కడగండ్లూ లేని కొత్త లోకాన్ని అందిస్తుందని బలంగా విశ్వసిస్తారు. మరి అలా చూస్తే కనుక శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చేసింది.

ఇక రాజకీయ జీవులు అయితే ప్రతీ విషయంలోనూ ఆశను చూస్తారు. అందులోనూ సెంటిమెంట్ గా తెలుగు వారికి ఉన్న ఉగాది అంటే అందరి కంటే రాజకీయ నేతలే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. రానున్న కాలం తమకు ఎలా ఉంటుందో అన్నది వారికి చాలా ఉత్స్తుకత ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న దాని కంటే బ్రహ్మాండమైన కాలం ముందు వస్తుందని రావాలని ఆశిస్తారు. ఆ విధంగా చూస్తే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాన్ని ఏ విధంగా చూస్తుంది, ఏ విధంగా మారుస్తుంది అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది.

యధా ప్రకారం ఉగాది పంచాంగం అన్నది ఆయా పార్టీల ఆఫీసులలో జరిగింది. ఎక్కడికక్కడ పంచాంగంలో ఆయా పార్టీలకే మంచి భవిష్యత్తు ఉంటుందని పంచాంగకర్తలు చెప్పారు. మీదే భవిష్యత్తు అని మంచి ఆశలు కల్పించారు. దాంతో ఎవరికి వారే తిరుగులేనిది ఈ తెలుగు ఏడాది అని భావిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏపీలో చూస్తే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతోంది. ఈ ప్రభుత్వం ప్రజలలో మంచి పనులు చేస్తోంది కాబట్టి మరింత కాలం అధికారం కూటమికే అని అందులోని పార్టీలు అనుకుంటున్నాయి. పంచాంగకర్తలు కూడా ఆ విధంగానే చెబుతున్నారు. అమరావతి పోలవరం వంటి ప్రాజెక్టులు శరవేగంగా కొత్త ఏడాదిలో పట్టాలెక్కుతాయని చెబుతున్నారు.

రాజకీయంగా ఎదురు ఉండదని పట్టిందల్లా బంగారమే అని కూడా చెబుతున్నారు. బలమైన కూటమి ముందు ప్రతిపక్షం ఎప్పటికీ వీక్ అనే భావిస్తున్నారు. ఒక టెర్మ్ కాదు మరిన్ని టెర్ములు ఉంటామని దానికి బలమైన పునాదులు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పడతాయని భావిస్తున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీ కూటమి పాలన మీద ప్రజలలో నెమ్మదిగా వ్యతిరేకత వచ్చేస్తోంది అని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో వైసీపీ బాగానే రాణించిందని అందువల్ల ఫ్యూచర్ వైసీపీదే అని ఫ్యాన్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. తాడేపల్లిలో జరిగిన పంచాంగ శ్రవణంలో జగన్ కి కొత్త ఏడాది అంతా మంచే చేస్తుందని పంచాంగకర్తలు చెప్పారు.జగన్‌ మళ్లీ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పారు. మిధున రాశిలో జన్మించిన జగన్‌మోహన్‌రెడ్డికి కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయని పంచాంగ పఠనంలో చెప్పడంతో వైసీపీ నేతలు ఆనందంతో ఉన్నారు.

ఇక తెలంగాణాలో చూస్తే అధికార కాంగ్రెస్ కి తిరుగులేదని పంచాంగకర్తలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా చెబుతున్నారు. ఇక అనుకున్న పనులు అన్నీ ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి చేస్తారు అని జోస్యం చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండూ ఒకే తీరున సాగుతాయని అంటున్నారు.

బీజేపీకి ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందని పంచాంగ శ్రవణం అదే చెప్పింది అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అంటున్నారు. ఇక మీదట బీజేపీకి వచ్చేవన్నీ మంచి రోజులే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తొందరలో రాష్ట్ర జాతీయ కమిటీలు ఏర్పాటు అవుతాయని ఆయన వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడం కోసం క్యాడర్ అంతా పనిచేయాలని కోరారు.

బీఆర్ఎస్ విషయం తీసుకుంటే అదే ధీమాతో ఉంది. ఇప్పటికే గేర్ మార్చామని ఇక మిగిలింది స్పీడ్ పెంచడమే అని ఆ పార్టీ భావిస్తోంది. కొత్త తెలుగు ఏడాదితో ప్రజల ఆశలు నెరవేరుతాయని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ లో ఆశలు రెట్టింపు అయ్యాయనే అంటున్నారు.