Begin typing your search above and press return to search.

రాజకీయ వారసత్వం పోరులో సమిధలెందరో ?

అది ఒక్కోసారి బంధాలు అనుబంధాలు రక్త బంధాలను దాటి ముందుకు సాగుతుంది. అయినా అందులో నెగ్గిన వారు కొందరే. తల ఒగ్గిన వారే ఎందో.

By:  Tupaki Desk   |   27 Oct 2024 7:30 AM GMT
రాజకీయ వారసత్వం పోరులో సమిధలెందరో ?
X

రాజకీయాల్లో పదవులు కావాలి. అవి ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే వాటిని అందుకోవడానికి ఒక తరం నుంచి రెండవ తరం పోటీ పడినపుడు సహజంగానే వారసత్వం పోరు స్టార్ట్ అవుతుంది. అది ఒక్కోసారి బంధాలు అనుబంధాలు రక్త బంధాలను దాటి ముందుకు సాగుతుంది. అయినా అందులో నెగ్గిన వారు కొందరే. తల ఒగ్గిన వారే ఎందో.

భారతదేశం అంటేనే వారసత్వ రాజకీయాలకు మూలంగా చరిత్ర చెబుతోంది. స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ కుటుంబం నుంచి తొలి వారసురాలిగా ఇందిరా గాంధీ కనిపిస్తారు. ఆమెకు సొంత కుటుంబంలో పోటీ లేదు కానీ కాంగ్రెస్ సీనియర్లతో పేచీ వచ్చింది.

అయితే ఎన్నో కష్టాలు నష్టాలు చవి చూసి చివరికి ఆమె తనదైన వ్యూహాలతో దాంతో పాటు తన ప్రతిభతో బయటకు వచ్చారు. పదహారేళ్ల పాటు సుదీర్ఘమైన పాలనను ఆయన దేశానికి ప్రధానిగా అందించి ఉక్కు మహిళగా నిలిచారు. ఇక ఇందిర తన ఇద్దరి కుమారులలో వారసుడిగా సంజయ్ గాంధీని ఎంచుకున్నారు. అయితే 33 ఏళ్లకే సంజయ్ గాంధీ మరణించడంతో రాజీవ్ గాంధీ అనూహ్యంగా ఆ స్థానంలోకి వచ్చారు. అయితే సంజయ్ ప్లేస్ లో వారసురాలు అవుదామనుకున్న ఆయన భార్య మేనకాగాంధీ మాత్రం గాంధీ కుటుంబానికి బయటనే ఉండాల్సి వచ్చింది.

ఇక 1960 దశాబ్దాల్లో స్థాపించిన శివసేనలో బాల్ థాకరేకు వెన్నంటి ఉన్న సోదరుడి కుమారుడు రాజ్ ఠాక్రే చివరికి ఓడి బయటకు వెళ్ళిపోయారు. సొంత కుమారుడు ఉద్ధవ్ థాక్రేకే వారసత్వాన్ని బాల్ థాక్రే కట్టబెట్టారు.

తమిళనాడులో చూస్తే డీఎంకేలో వారసత్వ సమస్య వచ్చింది. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి చిన్న కుమారుడు స్టాలిన్ మధ్యన జరిగిన పోరులో చివరికి స్టాలిన్ గెలిచారు. పార్టీ పగ్గాలు అందుకుని సీఎం అయ్యారు. ఇపుడు ఆయన వారసుడిగా ఉదయనిధి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీలో కీలక స్థానానికి చేరుకున్నారు.

తాను అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పిన ఎన్టీఆర్ కి కూడా వారసత్వ బెడద తప్పలేదు. ఆయన ఇద్దరు అల్లుళ్ళూ ఆయనకు సాయంగా రాజకీయాల్లో ఉండేవారు. అయితే మధ్యలో వచ్చిన లక్ష్మీపార్వతికి వారసత్వం ఎక్కడ పోతుందో అని కుటుంబం అంతా కలసి అన్న గారిని గద్దె దించేశారు.

ఆ మీదట చంద్రబాబు తనకు సహకరించిన వారిని అందరినీ నెమ్మదిగా వారసత్వం పోటీలోకి రాకుండా చూసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేరే దారి చూసుకున్నారు. బావమరిది హరిక్రిష్ణ అయితే అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి కూడా ఓటమి పాలు అయ్యారు. ఇపుడు టీడీపీ చంద్రబాబు పరం అయింది. ఆయన కుమారుడు లోకేష్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారసత్వ పగ్గాలు సులువుగా దక్కుతున్నాయి.

తెలంగాణాలో చూస్తే మరో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లో ఈ రోజుకు బయటకు కనిపించని వారసత్వపు వార్ జరుగుతోంది అని అంటారు. అయితే పెద్దాయనగా కేసీఆర్ ఉన్నారు. ఆయన వారసుడు కుమారుడా మేనల్లుడా అన్నది కూడా కాలం నిర్ణయిస్తుంది అంటున్నారు.

ఇక వైఎస్సార్ అనబడే ఉమ్మడి ఏపీని పాలించిన దిగ్గజ నేత వైఎస్సార్ వారసుడిగా జగన్ బయటకు వచ్చారు. జనాలు ఆయనను గుర్తించారు. జగన్ కి సహాయంగా సోదరి షర్మిల తల్లి విజయమ్మ కూడా రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించారు.

ఈ క్రమంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ మీదట అసలైన వారసత్వ పోటీ వచ్చింది. జగన్ తో పాటుగా రాజకీయ వారసత్వాన్ని షర్మిల కోరుకున్నారు అంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అది అందలేదు, ఆ మీదట ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టారు, ఏపీకి వచ్చారు, కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా పదవిని తీసుకున్నారు. అన్న మీద ఆమె పోరు సాగిస్తున్నారు. అది ఆస్తుల కోసం పోరు అయినా దాని వెనక రాజకీయ ఆకాంక్షలు నెరవేరలేదన్న కసి బాధా ఉన్నాయని అంటున్నారు

వైఎస్సార్ వారసత్వం ఎవరిది అన్నది ఎప్పుడో తేలిపోయింది. లేట్ గా షర్మిల వేరు పడి మళ్ళీ పోటీ అన్నా జనాలు ఒప్పేది లేదు, ఎందుకంటే ఆ ఫలాలు ఆల్రేడీ జగన్ కి ఇచ్చేశారు. సో అలా షర్మిల రాజకీయంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారనే చెప్పాల్సి ఉంది.

మరో వైపు చూస్తే వైఎస్సార్ వారసత్వం జగన్ కే అని అత్యధికులు భావిస్తున్నా దానికి ఈ అన్నా చెల్లెళ్ళ పోరు ఒక గుదిబండగా మారుతోంది. అంతిమంగా వైఎస్సార్ వారసత్వం ఎవరిది అన్న ఆసక్తి కూడా జనాలకు లేకుండా ఈ ఇద్దరి మధ్య సమరం కనుక చెలరేగితే మాత్రం అసలుకే ఎసరు వస్తుంది అని అంటున్నారు. మొత్తంగా చూస్తే వారసత్వం అన్నది కోరుకోవడం తప్పు కాదు, దానికి ఎలా చేరుకోవడం అన్నదే ముఖ్యం. ఆ విషయంలో గెలిచిన వారికి పదవులు దక్కితే ఓడిన వారు సమిధలుగా మిగిలిపోతున్నారు.