రాజకీయ సన్యాసం....అందమైన పద విన్యాసం !
సన్యాసం అంటే ఏమిటి సర్వం త్యజించడం. ఏ కోరికలు భౌతిక అవసరాలు లేకుండా చేసుకోవడం.
By: Tupaki Desk | 20 April 2025 11:00 PM ISTసన్యాసం అంటే ఏమిటి సర్వం త్యజించడం. ఏ కోరికలు భౌతిక అవసరాలు లేకుండా చేసుకోవడం. ముక్కు మూసుకుని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవడం. అయితే ఆధునిక కాలంలో సన్యాసానికి అర్ధాలు మారిపోతున్నాయి. కొత్త అర్థాలు పుట్టుకుని వస్తున్నాయి.
ఇక రాజకీయం అన్నది ఎవరికైనా ఏ రంగంలోకి వారికైనా చివరి గమ్య స్థానం అయినప్పుడు దాని నుంచి వేరు పడి పోయేది ఏమి ఉంటుంది అన్నది ఒక చర్చ. మరో వైపు చూస్తే రాజకీయం ఇక ఇంద్రజాలం మహేంద్రజాలం. అందులో ఎంట్రీ మాత్రమే ఉంటుంది. ఎగ్జిట్ అన్నది ఉండదు. అలా అనుకున్నా ఎవరి వల్లా రాజకీయ సన్యాసం కానే కాదు.
రాజకీయాలలో రిటైర్మెంట్ ఎలా లేదో సన్యాసం అన్నది కూడా లేదు. అయితే అందమైన పద విన్యాసంగా దానిని నయా రాజకీయ నేతలు ఉపయోగిస్తున్నారు. అది తాత్కాలికంగా వచ్చిన ఆవేశం నుంచో లేక భావోద్వేగం నుంచో వచ్చిన మాటగా చూడాలేమో.
గతంలో కొందరు రాజకీయ సన్యాసం అంటే నిజంగా దూరం జరిగే వారు. దాంతో ఆ పదానికి ఎంతో గంభీరత సార్ధకత వచ్చింది. ఇక ఇటీవల కాలంలో చాలా మంది నాయకులు రాజకీయ సన్యాసం అంటున్నారు. కానీ అది కూడా వారి వ్యూహంలో ఒక భాగంగా వాడుకుంటున్నారు అన్నది తరువాత అర్ధం అవుతోంది.
ఒక పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఒక పెద్దాయన తాను రాజకీయాలకు దూరం అని ఉన్న పదవిని పార్టీని వదిలేశారు. తాను ఇక ఈ వైపు తొంగి చూడను అన్నారు. కానీ పట్టుమని రెండు నెలలు కూడా ఉండలేకపోయారు. ఇపుడు ఆయన మీడియా ముందుకు వచ్చి నేను రాజకీయంగా రీ ఎంట్రీ ఇస్తే ఎవరి నుంచి అయినా అనుమతి తీసుకోవాలా అని లా పాయింట్ తీస్తున్నారు. లాజిక్ ఎక్కువ మిళాయించి మరీ మాట్లాడుతున్నారు. ఆయన తానుగా చెప్పిన సన్యాసం మాటను చాలా కన్వీనియంట్ గా మరచిపోయారన్న మాట.
ఇక మరో నాయకుడు ఒక పార్టీలో పదవులు అనుభవించి సరిగ్గా ఎన్నికల ముందు వేరే పార్టీ నుంచి పోటీ చేసి భారీ ఓటమిని మూటగట్టుకుని ఆ బాధలో ఇక చాలు రాజకీయం అన్నారు. ఆరు నెలలు తిరగకుండానే ఆయనలో జ్ఞానోదయం కలుగుతోంది. పాత పార్టీ బాస్ కి కొత్తగా విషెస్ తెలియచేస్తూ తన రాజకీయ రీ ఎంటీని అలా తెలియచేస్తున్నారు అన్న మాట.
ఇక మరో నేత పార్టీ అధికారంలో ఉంటూ కీలకమైన పదవులు అనుభవించి ఓటమి చెందగానే నాకొద్దీ రాజకీయం అనేశారు. ఆనక ఆయన తనకు నచ్చిన పార్టీని వెతుక్కుని కండువా వేసుకుని మరీ దర్జాగా తన సొంత ఇలాకాలో రాజకీయ సందడి మొదలెట్టేశారు. ఇలా చెబుతూ ఉంటే లెక్కకు మించిన రాజకీయ సన్యాసులు కనిపిస్తారు. అయితే వీరంతా నిజమైన సన్యాసం తీసుకునే బాపతు కారు.
ఆ సమయానికి వారికి పరిస్థితులు అనుకూలించక కాస్తా విరామం ప్రకటిస్తారు అంతే. అందువల్ల దానిని రాజకీయ విరామం అని చెప్పాలే తప్ప సన్యాసం అని కాదు. కానీ రాజకీయ సన్యాసం అని భారీ మాటను వాడితే వచ్చే హైప్ వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు అనుచరుల నుంచి సింపతీ వస్తుంది. అయ్యో అంత పని చేయకండి నాయకా అని అభిమాన జనం ఆయనను పట్టుకుని మరీ బతిమాలి పాలిటిక్స్ లోకి సింహద్వారం గుండా తీసుకుని రావాలన్న మాట. లేదా ఏ పార్టీ అధినాయకత్వం అయినా ఈ వైపుగా చూసి ఈ నేత అవసరం చాలా ఉందే అని మెచ్చి మెడలో వరమాల వెయ్యాలన్నమాట.
అందువల్ల తెల్లనివి అన్నీ పాలూ కాదు నల్లనివి అన్నీ నీళ్ళూ కాదు రాజకీయ సన్యాసాలు అన్నీ నిజం కాదు అని అంతా అనుకోవాల్సిందే. అయినా వినేవారు ఉంటే చెప్పే వారు వేయి మంది అని అంటారు. రాజకీయం రుచి మరిగాక ఎవరైనా సన్యాసం అని అంటారా. సో సన్యాసులందరిలో రాజకీయ సన్యాసులు వేరయా అని అనుకోవడమే.
