మహానగరాల్లో మాయగాళ్లు.. ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు?
మహానగరాల్లో మాయగాళ్లు.. ఈ మాట ప్రతిపక్ష నాయకులు అనడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికార పార్టీ నాయకులే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 22 March 2025 10:41 AM ISTమహానగరాల్లో మాయగాళ్లు.. ఈ మాట ప్రతిపక్ష నాయకులు అనడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికార పార్టీ నాయకులే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాయగాళ్లు.. కంటికి కనిపించనివారు కాదు.. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. గత నాలుగు రోజులుగా ఈ విషయంపైనే అధికార పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతుండడం గమనార్హం. దోచుకో-దాచుకో.. నినాదాన్ని ఒంటబట్టించుకున్న ఈ మాయగాళ్ల కారణంగా సర్కార్లు చేస్తున్న మేళ్లు.. సముద్రంలో నీళ్ల మాదిరిగా మారుతున్నాయన్నది అధికార పార్టీలకు అందుతున్న సమాచారం.
ఏపీ విషయం ఇదీ..
ఏపీలో కూటమి పార్టీలకు 164 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. వీరిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు.. ఢక్కా ముక్కీ లు తిన్న ఉద్ధండులేనన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఒకరు.. భూముల కబ్జాలకు సెటిల్మెంట్ లకు తెరదీస్తుంటే.. మరొకరు.. ఇసుక, ఇంకొకరు మద్యం.. ఇవన్నీకాదనుకుంటే.. బదిలీల్లో తమ హవా కోసం ప్రయత్నిస్తున్నా రు.. ఇలా.. జేబు కాదు.. పెట్టెలు నింపుకొనేందుకు కాదేదీ.. అనర్హం అన్నట్టుగా మారిపోయింది. తాజాగా రెండు రోజుల నుంచి టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ఇవే. అధికార పార్టీ ఎమ్మెల్యేలే.. మాయగాళ్లుగా మారి.. ప్రజలనుంచి దోచుకుంటున్న తీరు.. లేఖలు, ఆధారాలతో సహా అందుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణలో ఏం జరుగుతోంది?
తెలంగాణలో పైకి అంతా బాగుందని అనిపించినా.. అంతర్గత కుమ్ములాటలు జిల్లాలస్థాయిలో కాంగ్రెస్ లోనే కనిపిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి నిర్మాణాల ద్వారా.. ప్రభు త్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల నుంచి పథకాల అమలు వరకు.. చేతులు తడుపుకోవడం కాదు.. సంచు లు సైతం నింపేసుకుంటున్న ఎమ్మెల్యేలు.. నగరాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న విషయం.. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలే.. ముఖ్యమంత్రిపేషీకి చేరవేశాయి. వీరిలో పేరు మోసిన నాయకులు, అధిష్టానం దగ్గర బలమైన లాబీయింగ్ చేయగలిగిన నాయకులు ఉండడం గమనార్హం.
ముఖ్యమంత్రుల తీరిదీ..
ఇక, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల తీరు.. మాయగాళ్లను గుర్తించలేని పరిస్థితిలో ఉండడం గమనార్హం. ఏపీ ముఖస్తుతికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వెనుక ఏం జరుగుతున్నా.. మీ పాలన బాగుందన్న ప్రశంసలు వస్తే చాలన్నట్టుగా చంద్రబాబు ఉండడం.. తమ్ముళ్లకు చాలా వరకు కలిసి వస్తోంది. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి అసలు వీటిని పట్టించుకునే తీరికే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలిసి కూడా.. తెలియనట్టే వ్యవహరిస్తున్నారు. ఫలితంగా.. వీరు చేస్తున్న కృషి, ఇరు రాష్ట్రాలను డెవలప్ చేయాలన్న లక్ష్యం.. వంటివి మాయగాళ్లు చేస్తున్న మహా మోసాల కారణంగా.. చిత్తవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా.. సీఎంలగురించికాకుండా.. మాయగాళ్ల గురించే చర్చిస్తున్నారంటే పరిస్థితి ఏ- రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా.. సొంత నేతలను సరిదిద్దుతారా? లేక, ప్రజలే సరిదిద్దే వరకు ఎదురు చూస్తారా? అనేది సీఎంలు తేల్చుకోవాల్సి ఉంది.