Begin typing your search above and press return to search.

విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. ఒకే సారి 9 మంది రాజీనామా!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   18 March 2025 1:34 PM IST
విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. ఒకే సారి 9 మంది రాజీనామా!
X

ఏపీలో వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థాయి నేతలు సైతం రాజీనామా బాట పడుతున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయగా, తాజాగా విశాఖ కార్పొరేషన్ కు చెందిన 9 కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రాజధాని అమరావతికి చేరుకున్నారు. దీంతో విశాఖ నగర రాజకీయం వేడిక్కెంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రాజకీయ మారుతోంది. విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, ఒంగోలు, తిరుపతి ఇలా రాష్ట్రంలో దాదాపు 11 కార్పొరేషన్లు ఉండగా, ఒక్కచోట కూడా టీడీపీ అధికారంలో లేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం విజయం సాధించి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైసీపీయే చేజిక్కుంచుకుంది.

అయితే రాష్ట్రంలో అధికారం చేతులు మారిన తర్వాత స్థానిక పాలనలోనూ మార్పు వస్తోంది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నెల్లూరు, ఏలూరు, తిరుపతి కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లుగా టీడీపీ నేతలు పదవులు దక్కించుకున్నారు. ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అవ్వగా, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విశాఖ కార్పొరేషన్లలోనూ టీడీపీ బలం పెరిగింది.

వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ కూటమి గూటికి చేరుతుండటంతో వైసీపీ తరఫున ఎన్నికైన మేయర్లు పదవులను వీడాల్సివస్తోంది. గుంటూరులో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా తాజాగా విశాఖలో 9 మంది కార్పొరేటర్లు పసుపు కండువాలు కప్పుకోడానికి సిద్ధమవడంతో నేడో రేపో అక్కడి మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 98 డివిజన్లు ఉండగా, వైసీపీకి మెజార్టీ దక్కింది.

అయితే ప్రస్తుతం వైసీపీ నుంచి వలసలు పెరిగిపోవడంతో టీడీపీ బలం పుంజుకుంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖలో టీడీపీకి 29 డివిజన్లు దక్కాయి. ఎన్నికల అనంతరం 12 మంది టీడీపీ కండువా కప్పుకోగా, తాజాగా మరో 9 మంది పార్టీ మారనున్నారని అంటున్నారు. అదేవిధంగా జనసేనకు ముగ్గురు ఉండగా, ఎన్నికల అనంతరం ఆ పార్టీలో ఏడుగురు చేరారు. బీజేపీ నుంచి ఒకరు గెలవగా, ఎన్నిక తర్వాత మరొకరు గెలిచారు. దీంతో జీవీఎంసీలో కూటమి బలం 62కు చేరింది. దీంతో మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. విశాఖలో గతంలో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా మొత్తం 10 కౌన్సిల్లను టీడీపీ గెలుచుకోవడం గమనార్హం.