Begin typing your search above and press return to search.

రేవంత్ మాటలకు అర్థాలు ఎన్నో ?

రేవంత్ రెడ్డి అంటేనే దూకుడు కలిగిన నేతగా చెబుతారు.

By:  Tupaki Desk   |   16 Feb 2025 3:11 AM GMT
రేవంత్ మాటలకు అర్థాలు ఎన్నో ?
X

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మాట్లాడుతున్న మాటలకు అర్ధాలు ఏమై ఉంటాయి అన్న చర్చ సాగుతోంది. ఆయన పాలనకు సరిగ్గా పద్నాలుగు నెలలు పూర్తి అయ్యాయి. రేవంత్ రెడ్డి అంటేనే దూకుడు కలిగిన నేతగా చెబుతారు. ఆయన రాజకీయ విమర్శలు సైతం పదును తేరి ఉంటాయి.

ఆయన తన మాటల ప్రవాహాన్ని అలా కొనసాగిస్తూనే ప్రత్యర్థుల మీద విమర్శల జల్లు కురిపిస్తారు. ఆయన ఇటీవల కాలంలో ఒక వైపు నుంచి తెలంగాణా సీఎం కేసీఆర్ ని మరో వైపు కేంద్రంలోని నరేంద్ర మోడీని కలిపి విమర్శిస్తున్నారు.

ఆయన మోడీని ఏకంగా కన్వర్టెడ్ బీసీ అనేశారు. ఈ మాట ఇప్పటిదాకా దేశంలో ఎవరూ అనలేదు. అంతవరకూ ఎందుకు మోడీ మీద నిత్యం పోరాటం చేసే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కానీ అలాగే ఇండియా కూటమి సారధ్యం కోసం ఎదురుచూస్తున్న మమతా బెనర్జీ కానీ నిన్నటి దాకా మోడీ మీద నిప్పులు చెరిగిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇలాంటి విమర్శలు చేయలేదు.

వారందరితో పోలిస్తే సీఎం గా తక్కువ అనుభవం ఉన్న రేవంత్ రెడ్డి పదే పదే ఎందుకు మోడీని టార్గెట్ చేస్తున్నారు అన్నది చర్చగా ఉంది. జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ మోడీ మీద గట్టిగా ఫైట్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కి ముగ్గురే సీఎంలు ఉన్నారు. వారిలో ఇద్దరి అయితే రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతున్నారు.

ఇక రేవంత్ రెడ్డి మాత్రం మోడీని గట్టిగా టార్గెట్ చేయడం ద్వారా రాహుల్ గాంధీకి తాను బలమైన అండగా ఉన్నాను అన్న సంకేతాలను ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక కాంగ్రెస్ లో పెద్ద గొంతుకలు తగ్గుతున్న సందర్భం ఒక వైపు ఉంది. దాంతో దక్షిణాదిన తెలంగాణా వంటి కీలక రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి బిగ్ వాయిస్ వినిపించడం ద్వారా కాంగ్రెస్ కి కొండంత అండగా ఉంటున్నారు అని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే ఇటీవల కాలంలో ప్రధాని మోడీ కేసీఆర్ కి ఒక లేఖ రాసి ఆయన సోదరి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఇది మామూలు పరామర్శగా చూడకూడదని రాజకీయ కూడికలు లెక్కలు అనేకం దీని వెనక ఉన్నాయని కూడా అంటున్న వారు ఉన్నారు. దాంతో బీఆర్ఎస్ ని బీజేపీని కలిపి ఒకేసారి విమర్శించడం ద్వారా రేవంత్ రెడ్డి తనదైన రాజకీయ వ్యూహానికి తెర తీస్తున్నారు అని అంటున్నారు. రేపటి రోజున నిజంగా ఈ పార్టీలు కలిసే పరిస్థితి ఉంటే అపుడు రేవంత్ రెడ్డి వ్యూహాలే మరింత పదునెక్కుతాయని అంటున్నారు.

ఇక మోడీని ఢీ కొట్టడం ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కీలక నేతలలో ఒకరిగా ఉండాలన్న ఆలోచన కూడా ఆయనకు ఉందా అన్న చర్చ సాగుతోంది. అలాగే బీసీలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ఎత్తుగడ కూడా ఉందని అంటున్నారు. ఇక తాజాగా ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి తాను ఉన్న విషయమే చెప్పాను తప్ప ప్రధాని మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని అన్నారు. ఆయన గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

అంతే కాదు తాను సీఎం గా ఉన్నపుడు నచ్చేవారు ఉంటారు నచ్చని వారు ఉంటారు అందరినీ మెప్పించడం తన తరం కాదని మరో కామెంట్ చేసారు. ఇదే విధంగా తానే కాంగ్రెస్ చివరి రెడ్డి సీఎం అయినా బాధ లేదని మరో మాట అంటున్నారు ఈ విధంగా చూస్తే కనుక రేవంత్ రెడ్డి అనేక రకాలైన అర్ధాలతో వ్యూహాలతో తనదైన శైలిలో ప్రకటనలు చేస్తున్నారు అని భావించాలి.

ఆయన తెలంగాణా కాంగ్రెస్ నేతల కంటే ఒక మెట్టు పైన ఉన్నారని చెప్పడానికి అనేక రకాల ప్రయత్నంగా వీటిని చూడాల్సి ఉంది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి తన ప్రకటనలతో మరింత దగ్గరగా అయ్యేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి రాజకీయ నేతల ప్రకటనల వెనక అర్ధాలు పరమార్థాలు ఎన్నో ఉంటాయి. రాజకీయంగా ఢక్కామెక్కీలు ఎన్నో చూసిన రేవంత్ రెడ్డి మాటలకు కూడా అనేక అర్ధాలు వ్యూహాలు ఉన్నాయని ఎవరైనా విశ్లేషుచుకున్నా తప్పు లేదేమో అని అంటున్నారు.