Begin typing your search above and press return to search.

నేడు కేటీఆర్ అరెస్ట్ ఉండదా..? కాంగ్రెస్ స్ట్రాటజీ ఇదేనా..?

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రారావుతో కలిసి ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 8:07 AM GMT
నేడు కేటీఆర్ అరెస్ట్ ఉండదా..? కాంగ్రెస్ స్ట్రాటజీ ఇదేనా..?
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో నేడు ఏం జరగబోతోందా అన్న టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. కేటీఆర్‌ను ఈ రోజే అరెస్ట్ చేస్తారా..? కేవలం విచారించి పంపించేస్తారా..? ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్ట్రాటజీ తీసుకోబోతోంది..?

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రారావుతో కలిసి ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందు ఉదయం నుంచి ఆయన తన నివాసంలో లీగల్ టీంతో చర్చలు జరిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. అలాగే విచారణకు వెళ్లే ముందు సైతం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై కావాలనే కేసు పెట్టినట్లు ఆరోపణలు చేశారు. ఉదయం 10.10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌ను ఏసీబీ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. సుమారుగా మూడు గంటలుగా ఆయన విచారణ సాగుతోంది.

ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను విచారించారు. ఆయన నుంచి ఏసీబీ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. పలు ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు రాబట్టారు. ఈ రోజు కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు.. ఆయనకు 35 రకాల ప్రశ్నలు వేస్తున్నట్లుగా సమాచారం. నిన్న అరవింద్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా కేటీఆర్‌ను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. ఈరోజు ఏసీబీ విచారణ పూర్తయ్యాక ఈనెల 16న కేటీఆర్ ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చి కేటీఆర్‌తోపాటు అరవింద్, బీఎల్ఎన్ రెడ్డిలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈడీ సైతం నిన్న బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది. కేటీఆర్ 16న హాజరుకావాల్సి ఉంది.

అయితే.. ముందు నుంచి ఫార్ములా-ఈ కారు రేసులో తాము ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. కేవలం రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం కేసు నమోదు చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదో లొట్ట పీసు కేసు అంటూ కామెంట్స్ సైతం చేశారు. మరోవైపు.. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకుంది. ఎవరి అనుమతులు లేకుండా రూ.55 కోట్లను విదేశీ కంపెనీలకు మళ్లించడంపై సీరియస్‌గా పరిగణించింది.

మరోవైపు.. కేటీఆర్ అరెస్ట్ ఈ రోజు ఉంటుందా..? అన్న చర్చ జరుగుతుండగానే.. మరో వాదన సైతం వినిపిస్తోంది. కాంగ్రెస్ స్ట్రాటజీని అంచనా వేస్తున్న పలువురు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా కాంగ్రెస్ తన పనిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ కావాలి.. కానీ అది తాము చేసినట్లుగా ఉండొద్దని ప్రభుత్వంలోని పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం.

త్వరలో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. నేడు ఏసీబీ విచారిస్తోంది. అయితే.. ఈ రోజే ఏసీబీ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి పోతుంది. కానీ.. ఈడీ అధికారులు ప్రశ్నించి.. ఆయనను అదుపులోకి తీసుకుంటే అది కేంద్రం చేసినట్లుగా కేంద్రం చేతికి మట్టి అట్టుకుంటుంది. సో.. ఈ స్ట్రాటజీనే ఈ కేసు విషయంలో ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. కవిత విషయంలోనూ ఈడీ ఎంటర్ అయి ఆమెను అరెస్ట్ చేసింది. కేటీఆర్‌ను సైతం ఏసీబీ నేతృత్వంలో అరెస్టు చేయకుండా.. కేవలం విచారించి వివరాలను రాబట్టి ఈ రోజు వదిలిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఈడీ విచారణ తరువాత.. కేంద్ర సంస్థ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏసీబీ తదుపరి కార్యాచరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేటీఆర్‌పై కేసు విషయంలో ముందు నుంచి ప్రభుత్వ పెద్దలు.. చట్టం తన పని తాను చేసుకు పోతుంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా ఈ కేసు గురించి పెద్దగా వ్యాఖ్యలు చేసింది లేదు. అందుకే.. తమ స్ట్రాటజీలో భాగంగానే పెద్దగా కామెంట్స్ చేయకుండా సైలెంటుగా పనిని పూర్తిగా చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈడీ కూడా విచారిస్తుండడంతో.. ఈడీ అరెస్ట్ చేస్తే తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తవుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఈడీ చర్యల వరకూ ఏసీబీ ఇలానే విచారణలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న అరవింద్ కుమార్‌ను విచారించిన ఏసీబీ, నేడు కేటీఆర్‌ను విచారిస్తోంది. ఆ తదుపరి బీఎల్ఎన్ రెడ్డిని విచారించనుంది. ముగ్గురి విచారణ పూర్తయ్యాక.. ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి ఈడీ విచారణ కూడా పూర్తవుతుంది. ఈ కేసులో విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో డబ్బును తరలించడాన్ని ఈడీ కూడా తప్పుబట్టింది. ఒకవేళ నేరాన్ని ముగ్గురు కూడా అంగీకరిస్తే ఈడీ ముగ్గురినీ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.