బాబ్బాబు అందుబాటులో ఉంటా.. నేతల ప్రచార పదనిసలు విన్నారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ప్రత్యర్తులపై నాయకులు రువ్వుతున్న విమర్శల్లో ఇవి కీలకంగా మారాయి
By: Tupaki Desk | 15 Nov 2023 2:30 PM GMT''ఔను. అయిందేదో అయిపోయింది. కానీ, ఇక నుంచి నియోజకవర్గంలోనే ఉంటాను. స్థానికంగా మీ సమస్యలను పరిష్కరిస్తాను. ఈ సారి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించండి''- పాలేరులో ఓ ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన అభ్యర్థన ఇది.
''ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటా. మీ ఇంటి ఆడ బిడ్డగా నన్ను ఆదరించి ఆశీర్వదించండి. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవకురాలిగా సేవలందిస్తా. నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి'' - ఇదీ మహేశ్వరం నియోజవకర్గంలో ఓ అభ్యర్థి చేసిన విజ్ఞాపన.
''ఆయన నాన్ లోకల్.. నేను లోకల్. నాకు తెలిసినట్టుగా ఆయనకు మీ సమస్యలు తెలియదు. పైగా నియోజకవర్గంలో గెలిచాక ఏడాదికి ఒక్కసారైనా మీ గడపకొచ్చిండా? మీ చుట్టుమట్లు(సమస్యలు) ఎరిగిండా. నమ్మకుర్రి. నేను మీకు అండగా ఉంటా''- భైంసాలో ఓ అభ్యర్థి విన్నపాలు, విమర్శలతో కూడిన అభ్యర్థనలు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ప్రత్యర్తులపై నాయకులు రువ్వుతున్న విమర్శల్లో ఇవి కీలకంగా మారాయి. స్తానికతను కొందరు లేవనెత్తుతుంటే.. మరికొందరు స్థానికంగా ఉండరనే వాదనను తెరమీదికి తెస్తున్నారు. ఇంకొందరు జరిగిందేదో జరిగిపోయిందని.. ఇక నుంచి అండగా ఉంటామని.. ఇక్కడే ఇల్లు కట్టుకుంటామని, స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని ఓటర్లను ఊరిస్తున్నారు.
మొత్తంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 40 మంది సిట్టింగు ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాల్లో సొంత ఇళ్లు లేకపోవడం గమనార్హం. ఈ విషయం అఫిడవిట్లలోనూ బయట పడింది. దీంతో ఈ అవకాశాన్ని ప్రత్యర్తులు అందిపుచ్చుకున్నారు. దీనిని ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు. స్థానికంగా ఉండని, స్థానిక సమస్యలు పట్టించుకోని వారికి ఓటెందుకు వేయాలంటూ..ప్రచారంలో దంచి కొడుతున్నారు. దీంతో ఇప్పుడు ఆయా అభ్యర్థులు.. బాబ్బాబు.. ఇక్కడే ఉంటా, మీ సమస్యలు పట్టించుకుంటా.. అంటూ.. ప్రజలను బ్రతిమాలుకునే పరిస్థితి వచ్చింది.
చిత్రం ఏంటంటే.. గత 2018 ఎన్నికల్లో ఈ తరహా ప్రచారం కనిపించలేదు. కానీ, ఈ సారి పోటీ తీవ్రంగా ఉండడం.. బీఆర్ ఎస్-కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీ విమర్శలు, మాటల తూటాలతో ప్రచారం జోరుగా సాగుతుండడం. అధికారం ఇరు పక్షాల మధ్యే దోబూచులాడుతుండడంతో ప్రత్యర్థులపై అవకాశం చిక్కిన ప్రతి అంశాన్నీ అభ్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీంతో స్థానికేతరులు, లేదా స్థానికంగా ఇళ్లు లేని నాయకులు ఇప్పుడు.. తర్జన భర్జన పడుతూ..ఓటర్లను బ్రతిమాలుకుంటున్న పరిస్తితి కనిపిస్తోంది. మరి ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తారో చూడాలి.