ఖమ్మంలో పొలిటికల్ ఫ్యామిలీస్.. తరతరాలుగా ప్రజాప్రతినిధులు!
వీరిలో కొన్ని కుటుంబాలకు చెందిన వారు జిల్లా రాజకీయాలతో పాటు ఇతర జిల్లాల్లో సైతం పోటీ చేసి గెలుపొందటం విశేషం.
By: Tupaki Desk | 13 Nov 2023 5:30 PM GMTతెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మంలో బీఆరెస్స్ కి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొన్ని కుటుంబాలకు చెందిన నేతలు వరుసగా ప్రజాప్రతినిధులుగా ఎంపికవ్వడం గమనార్హం. వీరిలో కొన్ని కుటుంబాలకు చెందిన వారు జిల్లా రాజకీయాలతో పాటు ఇతర జిల్లాల్లో సైతం పోటీ చేసి గెలుపొందటం విశేషం.
అవును... ఖమ్మం జిల్లాలో చెప్పుకోవాల్సిన నేతల్లో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దివంగత జలగం వెంగళరావు ఒకరు. ఈయన కుటుంబం నుంచి మొత్తం నలుగురు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో విజయాలు సాధించారు. ఇందులో భాగంగా... జలగం వెంగళరావు 1962, 1967, 1972లో వేంసూరు, 1978లో సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో... 1984, 1989 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు.
ఇదే క్రమంలో జలగం వెంగళరావు సోదరుడు జలగం కొండలరావు 1957లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా.. 1977, 1980 ఖమ్మం ఎంపీగా గెలిచారు. అదేవిధంగా... వెంగళరావు కుమారుడు జలగం ప్రసాదరావు 1983, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక వెంగళరావు మరో కుమారుడు జలగం వెంకట్రావు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి, 2014లో కొత్తగూడెం నుంచి బీఆరెస్స్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ క్రమంలో... పీసీసీ మాజీ అధ్యక్షుడు దివంగత మల్లు అనంతరాములు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి 1980, 1989 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అదేవిధంగా ఆయన సోదరుడు మల్లు రవి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో 2008లో ఎమ్మెల్యేగా.. ఆ తర్వాత నాగర్ కర్నూల్ నుంచి 1991, 1998లో ఎంపీగా విజయం సాధించారు.
అదేవిధంగా.. అనంతరాములు మరో సోదరుడు మల్లు భట్టివిక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నాలుగోసారి పోటీ చేస్తున్నారు.
ఇదే క్రమంలో... దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి 1996 ఉప ఎన్నికలో ఆ తర్వాత 1999, 2004 లో సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. 2009 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు విజయాలు సాధించారు. ఇదే సమయంలో సహకార, ఉద్యానశాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఇలా మొత్తం అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
ఇక రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి 1985, 1989, 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచీ.. 2009లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా ఈయన కూడా మొత్తంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగానూ పని చేశారు.
ఇదే క్రమంలో బీఆరెస్స్ మంత్రి పువ్వాడ అజయ్ ఫ్యామిలీ కూడా ఉంది. సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు 1989, 1994 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా.. ఆ తర్వాత ఓ పర్యాయం ఎమ్మెల్సీగా చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పువ్వాడ అజయ్ ఇదే నియోజకవర్గం నుంచి 2014 కాంగ్రెస్, 2018లో టీఆరెస్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మూడోసారి బరిలో నిలిచారు.