Begin typing your search above and press return to search.

'కట్ డ్రాయర్ ఎమ్మెల్యే – నిక్కర్ మంత్రి'... ఇంకా దిగజార్చేస్తున్నారు!

నేతలు మీడియాతో మాట్లాడితే న్యూస్ ఛానల్స్ లో కూడా మ్యూట్ లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది!

By:  Tupaki Desk   |   16 Aug 2024 8:44 AM GMT
కట్  డ్రాయర్  ఎమ్మెల్యే – నిక్కర్  మంత్రి... ఇంకా దిగజార్చేస్తున్నారు!
X

రాజకీయాలు అంటే పూర్తిగా ప్రజాసేవ చేయడం అనే సంగతి చాలా మంది నేతలు మరిచిపోతున్నారనే కామెంట్లు ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో రాజకీయాల్లో వినిపించే భాష రోజు రోజుకీ దిగజారిపోతుందనే చర్చా బలంగా జరుగుతుంది. నేతలు మీడియాతో మాట్లాడితే న్యూస్ ఛానల్స్ లో కూడా మ్యూట్ లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది!

దీనితో పాటు సదరు ప్రత్యర్థి రాజకీయ నాయకుడి ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా విమర్శించడం, వారి కుటుంబ విషయాలను మీడియా ముందు ప్రస్తావిస్తుండటం కూడా కామన్ ఐపోయింది. ఇక క్యారెక్టర్ అసాసినేషన్ సంగతైతే చెప్పేపనేలేదు. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యాలేవీ లేవు. ఎవరూ తక్కువ తినలేదన్నట్లుగానే వ్యవహారం ఉంటుంది.

ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ సంగతి సరేసరి. రాజకీయ పార్టీలకు సొంత గొంతుకగా ఉండాల్సిన సోషల్ మీడియాలో ఇప్పుడు చిల్లర కామెంట్లు, ఏమాత్రం ఆమోదయోగ్యం కాని భాష, జుగుప్సాకరమైన పదప్రయోగాలు వెరసి... రాజకీయాలను మాగ్జిమం దిగజార్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నాయనే వొ,అర్శలు సొంతం చేసుకుంటున్నాయి.

అలా అని ఆ సోషల్ మీడియా అకౌంట్లు ఎవరో అనామకులు, అజ్ఞానులు మెయింటైన్ చేస్తున్నవి కాదు. వాటిలో చేసినా కూడా ఆమోదయోగ్యం కాదు. అయితే స్వయంగా రాష్ట్రంలోని రెండు బలమైన పార్టీలకు చెందిన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఈ తరహా చిల్లర కామెంట్లు వినిపిస్తున్నాయనే మాటలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

అవును... ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అధికార టీడీపీ, వైసీపీ లకు చెందిన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో ఒకరు "నిక్కర్ మంత్రి" అని కామెంట్ చేస్తే.. మరొకరు "డ్రాయర్ ఎమ్మెల్యే" అని కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో... విమర్శల్లో సహేతుకత, భాషలో హుందాతనం కనుమరుగైపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా అన్నక్యాంటిన్ల నిర్వహణకు ఇప్పటికే చాలా మంది విరాళాలు ఇస్తున్నారని చెబుతూ, అంతా ఈ విషయంలో ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరుతూ లోకేష్ పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన వైసీపీ... "పేదలను రక్షించడానికే విరాళాలు... నిక్కర్ మంత్రి సరికొత్త స్టేట్ మెంట్" అని ఎక్స్ లో దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది.

దీనికి కౌంటర్ గా స్పందించిన టీడీపీ... "ఈ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్ ఎంత సిగ్గుమాలిన సైకోనో చూడండి. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని ఫ్యామిలీ ఇది. విరాళం అంటే ఏడుస్తున్నాడు.. అన్న క్యాంటీన్ అంటే ఏడుస్తాడు.. ఏనాడైనా ఒకడికి పెడితే తెలుస్తుంది.. దోచుకుతిని బ్రతికే బ్రతుకులకు ఇలాంటివి ఏమి తెలుస్తాయిలే" అని రియాక్ట్ అయ్యింది.

దీంతో... నిక్కర్ మంత్రి – కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ ఈ భాషను స్వయంగా రాజకీయ పార్టీల అధికారిక సొషల్ మీడియాలోనే దర్శనమివ్వడం ఏమిటంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాల్లో భాషను ఇంకా ఏ మేరకు దిగజార్చుతారో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరిస్తున్నారు!

కాగా... గతంలో జగన్ ను సైకో, జలగ, వాడు వీడు అని విమర్శించిన టీడీపీ, ఇప్పుడు నిక్కర్ ఎమ్మెల్యే అని సంభోదిస్తుంది. ఇక లోకేష్ ను వైసీపీ నేతలు పప్పుగాడు, తుప్పుగాడు అని కామెంట్స్ చేసేవారు. ఇప్పుడు నిక్కర్ మంత్రి అని సంభోదిస్తున్నారు.