Begin typing your search above and press return to search.

ఇద్దరి చంద్రులు మంచోళ్ళు...కొడుకులు మాత్రం....?

ఏపీకి తెలంగాణాకు ఇద్దరు చంద్రులు ఉన్నారు. వారిలో ఒకరు రాజకీయ దిగ్గజ నేత చంద్రబాబు అయితే మరో సీనియర్ నేత కె చంద్రశేఖరరావు

By:  Tupaki Desk   |   8 Nov 2023 3:29 PM GMT
ఇద్దరి చంద్రులు మంచోళ్ళు...కొడుకులు మాత్రం....?
X

ఏపీకి తెలంగాణాకు ఇద్దరు చంద్రులు ఉన్నారు. వారిలో ఒకరు రాజకీయ దిగ్గజ నేత చంద్రబాబు అయితే మరో సీనియర్ నేత కె చంద్రశేఖరరావు. ఈ ఇద్దరు నేతలూ రాజకీయ వ్యూహాలలో ఆరి తేరిన వారు ఎర్లీ సెవెంటీస్ నుంచి రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు మూడు సార్లు సీఎం అయితే కేసీయార్ రెండు సార్లు అయ్యారు. ఇక కేసీయార్ కేంద్ర మంత్రిగా కూడా కొంతకాలం ఉన్నారు. రెండున్నర దశాబ్దాలుగా చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటే కేసీయార్ బీయారెస్ ఏకచత్రాధిపత్యంగా అధ్యక్షుడు.

ఇద్దరికీ మరింతకాలం రాజకీయాల్లో కొనసాగాలని కోరిక ఉంది. దానితో పాటు ఇద్దరికీ రాజకీయ వారసులు ఉన్నారు. కేసీయార్ కి కేటీయార్ అచ్చమైన రాజకీయ వారసుడు. చంద్రబాబుకు లోకేష్ నిజమైన వారసుడు.

తాము అధికారంలో ఉండగానే కొడుకులకు పట్టాభిషేకం చేయాలని తండ్రులకు ఉందని ప్రచారంలో ఉంది. 2019లో చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే లోకేష్ కి కచ్చితంగా అవకాశం దక్కేదని, సీఎం అయి ఉండేవారు అని అంటారు. ఇక కేసీయార్ ఈ దఫా సీఎం అయితే మాత్రం కేటీయార్ కే సీఎం సీటు అప్పగిస్తారని వినిపిస్తోంది.

ఈ నేపధ్యంలో తండ్రుల గొప్పతనం గురించి తనయులు ఇద్దరూ మీడియాలో పలు మార్లు వేరు వేరుగా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే ఆసక్తిగా కనిపిస్తాయి. ముందుగా లోకేష్ గురించి చూస్తే ఆయన యువగళం పాదయాత్ర సందర్భంగా అన్న మాటలేంటి అంటే మా నాన్న చంద్రబాబు చాలా మంచి వారు. నేను మాత్రం అలా ఉండను, నేను వేరేలా ఉంటాను అని చెప్పడం.

ఈ విధంగా లోకేష్ చెప్పి ఏమి మేసేజ్ ఇవ్వాలని అనుకున్నారో తెలియదు కానీ చంద్రబాబు చాలా మంచి వారు అని చెప్పడం మాత్రం జనాలకు సందేశంగా అందింది అని అంటున్నారు. ఇక ఇపుడు కేటీయార్ వంతు. ఆయన లేటెస్ట్ గా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా నాన్న కేసీయార్ గొప్ప పాలకుడు అని కితాబు ఇచ్చారు.

సీఎం గా ఆయన ఎంతో బెటర్. ఉత్తమ పాలన ఆయన చేశారు అని అన్నారు. మళ్ళీ బీయారెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా కేసీయారే సీఎం అవుతారు అని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాదు కేసీయార్ చాలా మంచి వారు అని కూడా అన్నారు.

ఈ సందర్భంగా ఆయన తెచ్చిన పోలిక మాత్రం ఆశ్చర్యంగా ఉంది. తాను కేసీయార్ అంత మంచి వాడిని కాను అని కేటీయార్ అనడమే ఆ విస్మయానికి కారణం. తన తండ్రి గ్రేట్ అంటూ తాను అలా కాను అని చెప్పడం ద్వారా తండ్రికి జనంలో ఇమేజ్ బిల్డప్ చేసి ఉండొచ్చు. కానీ కేటీయార్ మంచి వారు కాదా ఎందుకు అలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

నిజానికి కేటేయార్ ఏది మాట్లాడినా లాజిక్ ఉంటుంది. చక్కని విశ్లేషణ ఉంటుంది. అయితే తండ్రిని పొగిడే క్రమంలో ఎందుకు తనను తగ్గించుకున్నారో అర్ధం కావడం లేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కేటీయార్ తాను సీఎం రేసులో లేను అని చెప్పడం ఒకటైతే తండ్రి కేసీయార్ ని మించిన పాలకుడు ఎవరూ లేరు అని చెప్పడమే ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

ఏది ఏమైనా ఇద్దరు చంద్రులు మంచోళ్ళు అని కొడుకులే చెబుతున్నారు. ఏ కొడుకు అయినా తండ్రి గురించి అలాగే చెబుతారు. కాబట్టి జనాలు తమ తీర్పుని ఏ విధంగా ఇస్తారో చూడాలి. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు విషయం తీసుకున్నా ఆయన మంచితనం పాలనా దక్షతను చూసి జనాలు 2024లో ఏ రకమైన తీర్పు ఇస్తారో కూడా చూడాల్సి ఉంది.