రాజకీయాల్లో రాజకీయయే కదా చెయ్యాలి... నాయకుడు తప్పేముంది?
రాజకీయాలంటేనే.. ప్రత్యర్థులను నిలువరించడం. తమకు తాము ఎదగడం.. నిజానికి ఒకప్పుడు 100 శాతం ఉండేది
By: Tupaki Desk | 14 Jan 2024 2:30 AM GMTరాజకీయాలంటేనే.. ప్రత్యర్థులను నిలువరించడం. తమకు తాము ఎదగడం.. నిజానికి ఒకప్పుడు 100 శాతం ఉండేది. కానీ, ఇప్పుడు పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు ఏవైనా.. ప్రత్యర్థుల దూకుడు, వారి రాజకీయా లను నిలువరించడమే ప్రధానంగా మారిపోయింది. ఈ విషయంలో ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా.. అదికార పార్టీకి.. ప్రభుత్వానికి కూడా కోలుకోలేని దెబ్బతగలడం ఖాయం. ఈ విషయం.. ఒక్క వైసీపీలోనే అనుకుంటే పొరపాటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే మంత్రాన్ని పఠిస్తోంది.
తాజాగా ఏపీలో కొందరు వైసీపీ నాయకులు.. ప్రత్యర్థి పార్టీలను తిట్టని.. ప్రత్యర్థి పార్టీల నేతలపై విరుచుకు పడమని.. వైసీపీ నుంచి ఆదేశాలు వస్తున్నాయని.. ఇలా తాము చేయలేమని అంటున్నారు. అయినప్పటికీ.. టికెట్ కావాలని కోరుతున్నారు. కానీ.. వాస్తవం ఏంటంటే.. మారిన రాజకీయాలకు అనుగుణంగా నాయకులు కూడా మారాల్సిందే. ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిందే. కారణాన్ని సృష్టించుకుని మరీ.. ప్రత్యర్థులపై విమర్శలు చేసేవారికే పదవులు దక్కుతున్న విషయాన్ని గమనించాలని అంటున్నారు పరిశీలకులు.
బీజేపీని తీసుకుంటే.. ఏపీలో సోము వీర్రాజును పక్కన పెట్టారు. దీనికికారణం.. ప్రత్యర్థి పక్షంగా ఉన్న వైసీపీ పాలనపై ఆయన విమర్శలు చేయలేకపోవడమే. అదేసమయంలో పురందేశ్వరిని తీసుకువచ్చా రు. దీనికికారణం ఎలా ఉన్నా.. ఆమె ఈ పదవిని నిలబెట్టుకునేందుకు కారణాలు కల్పించుకుని మరీ వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక, టీడీపీలోనూ ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీని టార్గెట్ చేయాల్సిందేనని అంతర్గత చర్చల్లో పార్టీ చెబుతోంది. చంద్రబాబు కూడా అదే పనిచేస్తున్నారు.
ఇక, జనసేనలోనూ అంతర్గత చర్చల్లో తమ ప్రత్యర్థి పార్టీ వైసీపీ(బీజేపీతోను, టీడీపీతోనూ జనసేన మిత్రపక్షంగా ఉంది)పై నిప్పులు చెరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో మరింత దూకుడు ప్రదర్శించాలని పవన్ నేరుగా చెబుతున్నారు కూడా. సో.. ఎలా చూసుకున్నా.. రాజకీయం అంటేనే తనకు తాను ఎదగడం ఎలా ఉన్నా.. ప్రత్యర్థులను కంట్రోల్ చేయడం అనే సూత్రం ఇమిడి ఉంటుంది.
ఒకప్పుడు ఇది ఎన్నికల సమయంలోనే ఉంటే.. ఇప్పుడు నేరుగా బహిర్గతం అయింది. ఎన్నికలతో సంబంధం లేకుండా.. పోయింది. సో.. జగన్ కానీ, వైసీపీ కాని చెబుతున్న మాటలో తప్పేముందని అంటున్నారు పరిశీలకులు. ప్రత్యర్థి పార్టీలు బలం పుంజుకుంటే.. టికెట్ ఇచ్చినా.. నష్టమే కదా! అని వ్యాఖ్యానిస్తున్నారు.