Begin typing your search above and press return to search.

చరిత్ర చూడు : వారసత్వానికి కూడా జనమే ఓటేయాలి......!

ఇలా చూసుకుంటే దేశంలో చాలా చోట్ల జరిగింది. ఉత్తరాదిన చూస్తే సమాజ్ వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ చీఫ్ గా ఉంటూ పార్టీ పెట్టారు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:06 AM GMT
చరిత్ర చూడు :  వారసత్వానికి కూడా జనమే ఓటేయాలి......!
X

భారతదేశంలో వారసత్వం పట్ల మక్కువ ఎక్కువ. ఎంత ఆధునిక పోకడలు ఉన్నా కూడా వారసులను ముందుకు తెస్తారు రాజుల కాలం కాదు కానీ వారసులకు మాత్రం తిరుగులేకుండా పోతోంది. అది ఏ రంగం అయినా వారసులదే రాజ్యం. అయితే వారసత్వం కూడా అంత ఈజీగా దక్కదు. దానికీ ఇంటా బయటా ఎన్నో పోరాటాలు చేయాలి. ప్రజలు కూడా ఒక నాయకుడికి పిల్లలు ఎంత మంది ఉన్నా అందులో సమర్ధుడికే ఓటేసి వారసత్వ పీఠం ఎక్కిస్తారు.

ఇలా చూసుకుంటే దేశంలో చాలా చోట్ల జరిగింది. ఉత్తరాదిన చూస్తే సమాజ్ వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ చీఫ్ గా ఉంటూ పార్టీ పెట్టారు. ఆయన రాజకీయ వారసుడిగా అఖిలేష్ కుదురుకున్నారు. ఆ తరువాత తండ్రి రెండవ భార్య కుమారుడు వచ్చినా కూడా ప్రయోజనం లేకపోయింది.

ఇక మహరాష్ట్రలో శివసేనలో బాల్ థాక్రే ఉండగానే సొంత కొడుకు సోదరుడి కొడుకూ ఇద్దరూ వారసత్వం కోసం పోటీ పడ్డారు. చివరికి సోదరుడి కొడుకు బయటకు వెళ్లారు సొంత కొడుకు ఉద్ధవ్ థాక్రే పార్టీని నడిపిస్తున్నారు సీఎం కూడా అయ్యారు.

బీహార్ లో చూసుకుటే మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కి కుమారులు కుమార్తెలు ఎక్కువ మందే ఉన్నారు. కానీ చిన్న కుమారుడు తేజశ్వి యాదవ్ నే జనాలు ఆయన రాజకీయ వారసుడిగా గుర్తించారు. ఆయనే ఫ్యూచర్ సీఎం అంటున్నారు.

దక్షిణాదికి వస్తే డీఎంకే తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉంటోంది. ఆ పార్టీలో కరుణానిధి తొంబై ఏళ్ల పైబడి జీవించి ఆధిపత్యం చలాయించారు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. వారసులు కూడా ఎక్కువ. పెద్ద కుమారుడు అళగిరి చిన్న కుమారుడు స్టాలిన్ మధ్య వారసత్వ పోరు వచ్చింది. జనాలు మాత్రం స్టాలిన్ వైపే మొగ్గు చూపారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ ఒక్కటిగా ఉండి అధికారంలోకి వచ్చింది.

కర్నాటకలో చూసుకుంతే మాజీ ప్రధాని దేవేగౌడ కు వారసులు ఎక్కువ. ఆయన చిన్న కుమారుడు కుమార స్వామి తండ్రికి సిసలైన వారసుడిగా ఉంటూ సీఎం అయ్యారు. పెద్ద కుమారుడు రేవణ్ణ మంత్రి పదవితోనే సర్దుకోవాల్సి వచ్చింది.

ఇక తెలంగాణాలో చూసుకుంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ కి వారసత్వ పోరు బయటకు కనిపించని తీరులో ఉంది. కుమారుడు కేటీఆర్ పార్టీని లీడ్ చేస్తున్నారు. మరో వైపు మేనల్లుడు హరీష్ రావు, కవిత కూడా ఉన్నారు. వారు కూడా సమర్ధులే అనిపించుకుంటున్నారు.

ఇక తెలుగు రాజకీయ తేజం అన్న గారి కుటుంబంలో అతి పెద్ద రాజకీయ పోరుకు తెర లేచింది. ఎన్టీయార్ వారసుడు ఎవరు అని ఒక చర్చ చాలా కాలం క్రితం సాగింది. అల్లుళ్ళు కుమారులు రెండవ భార్య ఇలా చాలా మంది ఉంటే చివరికి అది చంద్రబాబుకే అని జనాలు నిర్ధారించారు.

ఇపుడు వైఎస్సార్ కుటుంబంలో వారసత్వ పోరుకు తెర లేచింది. 2019 దాకా అన్న జగన్ కి అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చిన చెల్లెలు షర్మిల ఇపుడు వైఎస్సార్ తనయగా కాంగ్రెస్ నుంచి పోటీకి వస్తున్నారు. జనాలు రాజన్న వారసురాలిగా తనను ఆదరించాలని ఆమె కోరుతున్నారు. అయితే వైఎస్సార్ వారసత్వం జగన్ కే కట్టబెడుతూ జనాలు 2011 నుంచే తీర్పులు ఇస్తూ వస్తున్నారు అన్నది వైసీపీ నేతల వాదన.

2024 ఎన్నికల్లో వైఎస్సార్ రాజకీయ వారసత్వం కోసం అన్నాచెల్లెళ్ళ మధ్య పోరు సాగనుంది. తీర్పు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక్క మాట ఇక్కడ చెప్పుకోవాలి. వారసత్వం అన్నది ఈజీ టాస్క్ కాదు. జనాల మెప్పు ఉన్న వారికే అది దక్కుతుంది. జవసత్వాలను నమ్ముకోమని సీనియర్ పొలిటీషియన్స్ చెబుతారు. వారసులు కూడా జవసత్వాలు కలిగి ఉంటేనే వారసులుగా గట్టిగా నిలబడతారు అన్నది నిజం.