Begin typing your search above and press return to search.

ఆ 12 స్థానాలపై అన్ని పార్టీల కన్ను

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

By:  Tupaki Desk   |   29 Oct 2023 10:33 AM GMT
ఆ 12 స్థానాలపై అన్ని పార్టీల కన్ను
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలు, సభలు, సమావేశాలు, నాయకుల చేరికలతో పొలిటికల్ సందడి నెలకొంది. ప్రజల ఆదరణను ఓట్లుగా మార్చుకునేందుకు అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. విజయానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకూడదనే పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 12 నియోజకవర్గాలపై అన్ని పార్టీలు కన్నేశాయి. ఆ 12 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడు కావడం ఇక్కడ విశేషం. దీంతో ఈ స్థానాల్లో గిరిజన ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు పన్నుతున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక, ఇల్లెందు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, డోర్నకల్, మహబూబాబాద్, నల్గండ జిల్లాలో దేవరకొండ.. ఈ 12 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడు స్థానాలు. ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 5, టీడీపీ 1 గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థిగా రాములు నాయక్ వైరాలో విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు, హరిప్రియ, ఆత్రం సక్కు, టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావుతో పాటు రాములు నాయక్ బీఆర్ఎస్లో చేరిపోయారు.

ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 ఎస్టీ రిజర్వుడు స్థానాల్లోనూ జెండా పాతాలని చూస్తోంది. పోడు పట్టాల పంపిణీ, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం, తండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం, 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తదితర విషయాలపై బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా ఎస్టీ ప్రజలపై హామీలు కురిపిస్తూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తాయి.