Begin typing your search above and press return to search.

నబూతో నభవిష్యత్తు...అంతేనా ?

కాదేదీ బూతులకు అనర్హం అన్నట్లుగా సమాజం తయారవుతోంది. మామూలుగా మాట్లడితే అసలు కుదిరి చావడం లేదు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 3:56 AM GMT
నబూతో నభవిష్యత్తు...అంతేనా ?
X

కాదేదీ బూతులకు అనర్హం అన్నట్లుగా సమాజం తయారవుతోంది. మామూలుగా మాట్లడితే అసలు కుదిరి చావడం లేదు. ఎందుకంటే మెదళ్ళు అన్నీ మొద్దు బారిపోయి ఉన్నాయని భావన. అందుకే చెవుల్లోనే కాదు మనసుల్లోనూ కలకాలం నిలవాలంటే వేరే భాష వాడాల్సిందేనా. ఇదే ఇపుడు చర్చగా ఉంది.

ఒకపుడు రాజకీయాలు ఇపుడు రాజకీయాలు అని ఒక పెద్ద విభజన గీత గీసి మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఒకనాడు హుందాకే కేరాఫ్ గా పొలిటీషియన్లు ఉండేవారు. అధికార పక్షం విపక్షాల మధ్య ఆవేశ కావేశాలు నాడూ ఉండేవి. కానీ హద్దులు అయితే దాటిపోలేదు.

ఒక ఉన్నత ప్రమాణాలను అంతా పాటిస్తూ వెళ్ళేవారు. ఇపుడు అలా లేదు పరిస్థితి అని అంతా పెదవి విరుస్తున్నారు. ఏపీలో అయిదేళ్ల పాటు అధికారం చలాయించిన వైసీపీలో కొందరు మంత్రులు తీరు వివాదాస్పదం అయింది అంటే వారు వాడే భాషను బట్టే అని అనేవారు. బూతుల నేతలు పోలింగ్ బూతులతోనే బుద్ధి చెప్పాలని కూడా రాజకీయం ఆసాంతం చూసిన పెద్దలు కూడా హితవు చెబుతూ వచ్చారు

ఇక ఏపీలో టీడీపీ నేతలు కొందరు కూడా అదే తీరులో గతంలో ఉండేవారు. వారిని మించి ఒవర్ డోస్ వైసీపీ చేయడం దాని ఫలితాలు చూడడంతో ఇపుడు రెండు వైపుల నుంచి ప్రస్తుతానికి కొంత కంట్రోల్ ఉన్నట్లుగా ఉంది. అయితే తెలంగాణాలో మాత్రం అలా లేదు. ఏపీని మించి అన్నట్లుగా సాగుతోంది.

ఆఖరుకు రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా తెచ్చి విమర్శలు చేస్తున్నారు. అత్యంత జుగుప్సాకరంగా ఈ విమర్శలు ఉంటున్నాయి. కాంగ్రెస్ మహిళా మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మధ్యలో సినీ తారలను తెచ్చి చేసిన కామెంట్స్ ని చూస్తే ఇదేమి రాజకీయం అనుకుంటున్నారు.

కేటీఆర్ ప్రత్యర్ధి పార్టీకి చెందిన వారు. ఆయన్ని విమర్శించాలి అంటే ఇంతకు మించినది లేదా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో మహిళా మంత్రి సురేఖను ట్రోల్స్ చేస్తున్న వారి విషయంలోనూ ఆలోచించాల్సిందే. ఆమెను ఎందుకు అలా చేస్తారు అని కూడా అంతా గట్టిగా వాదించాల్సిందే.

దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బూతుకు బూతుతోనే బదులు అన్నట్లుగా పరిస్థితి మారితే చేసేవారు ఎవరూ లేరు. పాతాళానికి దారులు వెతకకుండానే జారుడు బల్లలు అలా చూపిస్తూ ఉంటాయి. ఆఖరుకు ఎక్కడికి పోతున్నారో కూడా తెలియనంత లోతుల్లో పడిపోతారు. ఏది ఏమైనా సమాజంలో మార్పులు వచ్చాయి. ఒకనాడులా ఏ రంగమూ లేదు.

అయితే దేనికైనా ఒక చెలియలికట్ట ఉంటుంది. ఎంతలా మారింది అనుకున్నా ఎంతో కొంత హద్దు ఉండాలి. పరదాలు ఉండాలి. పరాచికాలు అయినా సరదాలు అయినా కూడా అవి వెగటుగా జుగుప్సగా మారనంతవరకే అంతా ఆస్వాదిసారు. ఒక్కసారి అవి కట్టు తప్పితే గుట్టు విప్పితే ఇక వేటికీ విలువ లేకుండా పోతుంది. అలా చేసుకోవాలో ఎలా మెలగాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఎవరూ కాదు, వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరు కాబట్టే ఇదంతా.